బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమగూడెం జాతీయ రహదారి సోమగూడెం ఓవర్ బ్రిడ్జిపై గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం (Road Accident ) చోటు చేసుకుంది. ఆగి ఉన్న ఇనుము లోడ్ లారీని ఇనుప రాడ్లతో వెళ్తున్న మరో లారీ వెనుకాల నుంచి ఢీ కొట్టింది. ఢీకొట్టిన లారీలో ఉన్న డ్రైవర్ గుర్జిత్ సింగ్ లారీ క్యాబిన్లో (Cabin) ఇరుక్కుపోయాడు (Driver stuck ) .
వెంటనే సమాచారం అందుకున్న కాసిపేట ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పెట్రో కార్ ఏఎస్ఐ బూర రవీందర్, బ్లూకోర్ట్ పీసీ సాజన్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ముందుగా మంటలు చెలరేగకుండా ముందస్తు జాగ్రత్తగా ఫైర్ ఇంజన్‌తో నీళ్లు చల్లి పోలీసు, 108 సిబ్బందితో కలిసి నాలుగు గంటల పాటు శ్రమించి డ్రైవర్‌ను భయటకు తీశారు. క్యాబిన్లో ఇరుక్కున్నంతసేపు 108 సిబ్బంది ఆక్సిజన్, ఫ్లూయిడ్స్ అందించి చికిత్స అందించారు. క్యాబిన్లో కాళ్లు విరిగి నాలుగు గంటల పాటు డ్రైవర్ నరకయాతనకు గురయ్యారు.
డ్రైవర్‌కు ధైర్యం చెప్పకుంటూ నాలుగు గంటల పాటు శ్రమించి అతి కష్టం మీద డ్రైవర్‌ను బయటకు తీసి అంబులెన్స్‌లో మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. బ్రిడ్జి మద్యలో ప్రమాదం జరగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింది నుంచి వాహనాలను మళ్లించారు. నాలుగు గంటల పాటు శ్రమించి డ్రైవర్‌ను కాపాడేందుకు కృషి చేసిన పోలీసులను, 108 సిబ్బందిని స్థానికులు అభినందించారు.