ఉట్నూర్ రూరల్, జూన్ 16 : ఉట్నూర్ మండలంలోని బిర్సాయిపేట్ గ్రామ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గంట విజయలక్ష్మి(55), సహర్ష(14) మృతి చెందారు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన ఈర్ల రాజు, అతని భార్య సృజనిత, వీరి కుమారుడు సహర్ష, కూతురు ఆద్యశ్రీ, సృజనిత అమ్మ గంట విజయలక్ష్మి టీఎస్ 1 ఈపీ 9764 నంబరు గల కారులో మంచిర్యాల జిల్లా బెల్లంపెల్లిలోని తమ బంధువుల ఇంటి నుంచి ఆదిలాబాద్‌కు తిరిగిస్తున్నారు.
ఈ క్రమంలో సోమవారం బిర్సాయిపేట్ గ్రామ సమీపంలో కారు అదుపు తప్పి చెట్టుకు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సహర్ష, విజయలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. ఆద్యశ్రీకి తీవ్ర గాయాలయ్యాయి. రాజు, సృజనలకు గాయాలయ్యాయి. వీరిని స్థానికులు 108 అంబులెన్స్‌లో ఉట్నూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్సలందించారు.
మెరుగైన చికిత్స కొరకు రిమ్స్‌కు తరలించారు. ఆద్యశ్రీకి తీవ్ర గాయాలు కావడంతో రిమ్స్ దవాఖాన నుంచి హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతదేహాలను ఉట్నూర్ దవాఖానకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుల బంధువు జగన్మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు చేసున్నట్లు సీఐ మొగిలి, ఎస్సై మనోహర్ తెలిపారు.