కాసిపేట/వాంకిడి/భీమిని/నెన్నెల/ రెబ్బెన అక్టోబర్ 6 :అక్టోబర్ 6 : మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో పలు మండలాల్లో సోమవారం వాన దంచికొట్టింది. కాసిపేట, నెన్నెల, వాంకిడి, తదితర మండలాల్లో వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వారం రోజులుగా కురుస్తున్న వా నలతో పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయ ని రైతులు వాపోయారు. బెల్లంపల్లి పట్టణం లో బజార్ ఏరియా, పాతబస్టాండ్, కాంటా చౌరస్తా, 13వ వార్డు కాల్టెక్స్ ఏరియా, సెయింట్ మేరీస్ పాఠశాల, తదితర లోతట్టు ప్రాంతాలు రోడ్లపై నీరు పారింది. శాంతిఖని గని ఆవరణలో నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బంది కలిగింది. భీమినిలో జడ్పీ పాఠశాల విద్యార్థులు వర్షంలో తిప్పలు పడ్డారు. సైతం ప్లాస్టిక్ కవర్లు కప్పుకొని బడికి వెళ్లారు.
పిడుగు పాటుకు రెండు ఎడ్లు..
కౌటాల, అక్టోబర్ 6 : మండలంలోని ముత్తంపేటలో వర్షానికి పిడుగు పడి రెండు ఎడ్లు పంట చేనులో అక్కడికక్కడే మృతి చెందా యి. తనకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని బాధిత రైతు బెండారే శ్యాంరావు కోరాడు. బాధితుడిని బీఆర్ఎస్ నాయకులు వసంత్ రావు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, నాయకులు పరామర్శించారు. వర్షంతో కౌటాల మండల కేంద్రంలో వారసంతలోని వ్యాపారులు, కొనేందుకు వచ్చిన వారు ఇబ్బంది పడ్డారు.
ఉప్పొంగిన రాళ్లవాగు
మంచిర్యాలటౌన్, అక్టోబర్ 6: రెండు రోజులుగా మంచిర్యాలకు ఎగువన ఉన్న మందమర్రి, కాసిపేట, తిర్యాణి, నెన్నెల మండలాల్లో కురిసిన వర్షానికి సోమవారం సాయంత్రం రాళ్లవాగు ఉప్పొంగింది. మంచిర్యాలలోని లక్ష్మీటాకీస్ బైపాస్ రోడ్డు అమరవీరుల స్తూపం నుంచి రంగంపేటకు రాళ్లవాగుపై నిర్మించిన కాజ్వే వంతెన పైనుంచి వరదనీరు పొంగి ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది.