ఇంటి అనుమతులు ఈజీ..
మున్సిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులు తీసుకోవడం సులభతరమైంది. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ బీపాస్(తెలంగాణ స్టేట్ బిల్డింగ్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికెషన్ సిస్టం)ను అమల్లోకి తీసుకురాగా, భవన నిర్మాణ అనుమతుల కోసం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగడం, అధికారులను ప్రసన్నం చేసుకోవడం, నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది.
- టీఎస్ బీపాస్ అమలుతో తప్పిన తిప్పలు
- దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే పర్మిషన్
- మంచిర్యాల మున్సిపాలిటీలో 1994 దరఖాస్తులు
- అనుమతులిచ్చినవి 1547.. తిరస్కరించినవి 365..
- అండర్ ప్రాసెస్‌లో 36.. మిగితావి సింగిల్ విండో విధానంలో..
- బల్దియాకు రూ. 11.73 కోట్ల ఆదాయం
మంచిర్యాల టౌన్, జూలై 3 : మున్సిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులు తీసుకోవడం సులభతరమైంది. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ బీపాస్(తెలంగాణ స్టేట్ బిల్డింగ్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికెషన్ సిస్టం)ను అమల్లోకి తీసుకురాగా, భవన నిర్మాణ అనుమతుల కోసం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగడం, అధికారులను ప్రసన్నం చేసుకోవడం, నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే 21 రోజుల్లో అనుమతులు లభిస్తున్నాయి. నూతన మున్సిపల్ చట్టం 2019 ప్రకారం యజమాని ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా 21 రోజుల్లోనే భవన నిర్మాణ అనుమతులు వచ్చేలా రూపొందించిన ఈ టీఎస్‌బీపాస్ సిస్టంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
స్వీయ ధ్రువీకరణ ద్వారా ఆన్లైన్లోనే సంబంధిత పత్రాలను పొందు పరచాల్సి ఉంటుంది. tsbpass.telangana.govt.in వెబ్సైట్లో నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకుంటే స్థల విస్తీర్ణాన్ని బట్టి అందులోనే ఫీజులు నిర్ధారించి, అన్నీ సక్రమంగా ఉంటే 21 రోజుల్లోనే అనుమతులు లభిస్తున్నాయి. మంచిర్యాల మున్సిపాలిటీలో గడిచిన రెండున్నరేళ్లలో 1,994 మంది భవన నిర్మాణాల దరఖాస్తులు సమర్పించగా, అందులో 1,547 అర్జీలకు సంబంధించిన భవన నిర్మాణ అనుమతులు లభించాయి. వివిధ కారణాలతో 365 తిరస్కరించారు. 36 అండర్ ప్రాసెస్‌లో ఉన్నాయి. మిగిలినవి సింగిలోవిండో విధానంలో దరఖాస్తు చేసుకున్నారు. కాగా.. భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి ఇప్పటివరకు మంచిర్యాల మున్సిపాలిటీకి రూ.11.73 కోట్ల ఆదాయం సమకూరింది. నాలుగు ప్రదేశాల్లో కలిపి 19 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లే అవుట్లకు టెంటిటివ్ లేఅవుట్ అనుమతులు లభించాయి.
టీఎస్‌బీపాస్ ప్రత్యేకతలు
- టీఎస్‌బీపాస్‌తో మున్సిపాలిటీల్లో భవన నిర్మాణాలకు అనుమతులు సులభంగా లభిస్తాయి. స్వీయ ధ్రువీకరణతో తక్షణ అనుమతులు రానున్నాయి. 75 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లలో నిర్మించే భవనాలు పూర్తయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోవాలి. సదరు యజమాని ఇచ్చే స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఈ సర్టిఫికెట్‌ను 15 రోజుల్లో జారీ చేస్తారు. నివాసేతర భవనాలకు కూడా ఆర్కిటెక్ట్‌తో అటెస్ట్ చేయించిన స్వీయ ధ్రువీకరణ ఆధారంగా 15 రోజుల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇస్తారు.
- 75 చదరపు గజాల లోపు స్థలంలో ఏడు మీటర్ల ఎత్తు వరకు నిర్మించే నివాస భవనాలకు అనుమతులు అససరం లేదు. నామమాత్రంగా రూపాయి చెల్లించి భవన నిర్మాణ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందవచ్చు.
- 75 నుంచి 239 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లలో ఏడు మీటర్ల ఎత్తు (జీ ప్లస్ వన్) వరకు నిర్మించే నివాస భవనాలకు తక్షణ అనుమతి పొందే వీలుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగానే పర్మిషన్ వస్తుంది.
- 239 చదరపు గజాల నుంచి 598 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లలో పది మీటర్ల ఎత్తు ( జీ ప్లస్ 2) వరకు నివాస భవన నిర్మాణాలకు స్వీయ ధ్రువీకరణ పత్రం ఆధారంగా అనుమతులు ఇస్తారు.
- 598 గజాలకన్నా ఎక్కువ విస్తీర్ణం, జీ ప్లస్ 2 కంటే ఎక్కువ అంతస్తులు ఉండే ప్లాట్లలో నివాసేతర భవనాలకు సింగిల్ విండో పద్ధతుల్లో అనుమతులు ఇస్తారు. ఎన్వోసీ కోసం ఇతర శాఖలను సంప్రదించాల్సిన అవసరం ఉండదు. దరఖాస్తులను పరిశీలించి 21 రోజుల్లో పర్మిషన్ ఇస్తారు. ఏదైనా కారణంతో ఆ గడువులోపు అనుమతులు రాకుంటే దరఖాస్తుదారుడు అనుమతి వచ్చినట్లుగానే భావించాల్సి ఉంటుంది. 22వ రోజు ఆన్లైన్లో అనుమతి పత్రం పొందవచ్చు.
నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా
టీఎస్‌బీపాస్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు పొందుపరిచారు. స్వీయ ధ్రువీకరణలో ఇచ్చిన వివరాల ప్రకారం భవనాన్ని నిర్మించకుంటే నిర్మాణ దారులు ఇబ్బందులు పడుతారు. అనుమతులు పొందిన భవనాల వివరాలను బీపాస్ యాప్‌లో నమోదు చేస్తారు. వీటిని ఎప్పటికప్పుడు కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఈ కమిటీ అనుమతులు తీసుకున్న ప్రకారం భవన నిర్మాణం జరిగిందా లేదా ఏమైనా తేడాలు ఉన్నాయా? ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు ఏమైనా జరిగాయా?అని పరిశీలిస్తారు. ఒకవేళ తేడాలు ఏమైనా ఉంటే.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగితే ఎలాంటి నోటీసులు లేకుండానే వాటిని కూల్చేసే అవకాశం ఉంటుంది. జరిమానా కూడా విధిస్తారు.
లేఅవుట్లకు అనుమతులు
స్వీయ ధ్రువీకరణ ఆధారంగా దరఖాస్తు చేసుకున్న డెవలపర్లకు తాత్కాలిక లేఅవుట్ ప్లాన్ అనుమతిని ఆన్లైన్లో 21 రోజుల్లో ఇస్తారు. లే అవుట్ పూర్తి చేసుకున్న తర్వాత లైసెన్స్ కలిగిన సాంకేతిక సిబ్బందితో అటెస్ట్ చేయించి జిల్లా కమిటీలు పరిశీలించాకే తుది అనుమతులు జారీ చేస్తారు. మున్సిపాలిటీకి తనాఖాగా పెట్టిన ప్లాట్లను తుది అనుమతులు వచ్చిన 21 రోజుల తర్వాత విడుదల చేస్తారు. అనుమతులు తీసుకోకుండా భూమిని అభివృద్ధి చేసిన డెవలపర్‌కి ఆ భూమి విలువలో 25 శాతం జరిమానా విధిస్తారు. అక్రమ లేఅవుట్ వివరాలను సబ్ రిజిస్టార్కు సర్వేనంబర్ సహా నివేదికలను అందిస్తారు. దీంతో లేఅవుట్ లేని స్థలాలకు రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నిక్షిప్తం కావడంతో నిర్మాణాలకు అనుమతులు లభించవు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

