బోథ్, సెప్టెంబర్ 3 : వెనుకబడిన కులాల్లోని కులవృత్తుల వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం ఉపాధికి ఊతమిస్తున్నది. కులవృత్తుల్లో కొనసాగడానికి తోడ్పాటును అందిస్తున్నది. లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. బోథ్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 62 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం బీసీ బంధు పథకం కింద రూ.లక్ష సాయం మంజూరు చేసింది. బోథ్‌లో 26, సొనాలలో 15, ధన్నూర్(బీ)లో 8, కౌఠ (బీ)లో 6, కుచులాపూర్‌లో 6, చింతల్బోరిలో ఒకరి చొప్పున మంజూరయ్యాయి. వీరిలో రజకులు, నాయిబ్రాహ్మణులు, ఇతర కుల వృత్తుల వారు ఉన్నారు. ఇది వరకే కులవృత్తితో జీవనోపాధి పొందుతున్న వారు ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయంతో వారి వ్యాపారాలను మెరుగు పర్చుకున్నారు. మిగిలిన వారు కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టారు. ప్రభుత్వం అందించిన సాయంతో ఉపాధి పొందుతున్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు తమను గుర్తించి ఆదుకోలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు అండగా నిలిచిందని పేర్కొంటున్నారు. తమకు చేదోడువాదోడుగా నిలుస్తున్న ప్రభుత్వాన్ని అండగా ఉంటామంటున్నారు.
ఇస్త్రీ షాపు నడుపుకుంటున్నా…
ప్రభుత్వం అందించిన రూ. లక్షతో ఇస్త్రీ షాపు నడుపుకుంటున్నా. ఇది వరకు ఇంట్లోనే ఉదయం పూట పెట్టేతో ఇస్త్రీ చేసుకునే వాడిని. ఇప్పుడు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడంతో కొత్తగా షాపు పెట్టుకున్నా. కరెంట్‌తో నడిచే ఇస్త్రీ పెట్టే కొన్నా. దినమంతా బట్టలు ఇస్త్రీ చేసుకుంటున్నాను. చేతి నిండా పనితో ఉపాధి పొందుతున్నాను.
-మగ్గిడి శ్రీధర్, రజకుడు, కౌఠ(బీ)
షాపును బాగు చేసుకున్నా..
ఇది వరకు నా కటింగ్ షాపు అంతంత మాత్రంగానే ఉండేది. ప్రభుత్వం అందించిన రూ.లక్ష సాయంతో బాగు చేసుకున్నా. మెటీరియల్ కొత్తది కొనుగోలు చేశా. కావాల్సిన సామగ్రి తెచ్చుకున్నా. షాపులో సౌకర్యాలు పెరగడంతో షేవింగ్, కటింగ్, కలరింగ్ వంటి వాటి కోసం ప్రజలు వస్తున్నారు.
-పోల అశోక్, నాయిబ్రాహ్మణుడు, కౌఠ (బీ)