
ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో గులాబీ పార్టీ విజయదుందుభి మోగించింది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి దండె విఠల్ భారీ మెజార్టీతో విజయభేరి మోగించారు. కనీసం ప్రత్యర్థి పోటీ ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఇతర పార్టీల నాయకులు కూడా అభివృద్ధికి ఆకర్షితులై గులాబీ అభ్యర్థికే ఓటు వేయడం కొసమెరుపు. ఎన్నికేదైనా టీఆర్ఎస్దే విజయమని మరోసారి రుజువైంది. కాగా.. మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా.. 9.40 గంటలకు ఫలితం వెలువడింది. విఠల్ 667 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించగా.. ఎన్నికల రిటర్నింగ్ అధికారి సిక్తా పట్నాయక్ గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. విఠల్‌ను మంత్రి అల్లోల, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అభినందించారు.
ఆదిలాబాద్, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి దండె విఠల్ ఊహించినట్టుగానే భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టెక్నికల్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్(టీటీడీసీ)లో మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు అధికారులు నాలుగు టేబుళ్లపై ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మొదటగా పోలైన ఓట్లను 25 ఓట్లకు ఒక బండిల్ చొప్పున కట్టి లెక్కించారు. మొదటి మూడు టేబుళ్లలో 200 ఓట్లు, నాలుగో టేబుల్లో 262 ఓట్లను కౌంట్ చేశారు. ఎన్నికల పరిశీలకుడు నవీన్ మిట్టల్, రిటర్నింగ్ అధికారి సిక్తా పట్నాయక్ కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. 9.40 గంటలకు లెక్కింపు పూర్తయింది. టీఆర్ఎస్ అభ్యర్థి దండె విఠల్‌కు 742, స్వతంత్ర అభ్యర్థి పుష్పరాణికి 75 ఓట్లు వచ్చాయి. 45 ఓట్లు చెల్లకుండా పోయాయి. టీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ 667 ఓట్ల భారీ మెజార్టీతో స్వతంత్ర అభ్యర్థిపై విజయం సాధించారు. మొదటి టేబుల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి 164, పుష్పరాణికి 22 ఓట్లు రాగా.. 14 ఓట్లు చెల్లకుండా పోయాయి. రెండో టేబుల్లో టీఆర్ఎస్కు 174, స్వతంత్ర అభ్యర్థికి 18 ఓట్లు రాగా.. 8 చెల్లుబాటు కాలేదు. మూడో టేబుల్లో టీఆర్ఎస్కు 164, స్వతంత్ర అభ్యర్థికి 21 ఓట్లు రాగా.. 15 ఓట్లు చెల్లలేదు. నాలుగో టేబుల్లో టీఆర్ఎస్కు 240, ఇండిపెండెంట్‌కు 14 ఓట్లు రాగా 8 ఓట్లు చెల్లలేదు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన దండె విఠల్‌కు రిటర్నింగ్ అధికారి సిక్తా పట్నాయక్ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న ఉన్నారు.
ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్కే జై..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ ఎన్నిక జరిగినా ప్రజలు టీఆర్ఎస్కే జై కొడుతున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ను ఆదరించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 అసెంబ్లీ స్థానాలకుగాను 9 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. అనంతరం జరిగిన సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 80 శాతం స్థానాలను గులాబీ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సైతం భైంసా మినహా మిగతా వాటిలో గులాబీ జెండా ఎగిరింది. ఏడేళ్లుగా దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది. రైతులు, పేదల కోసం అమలు చేస్తున్న పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లలాంటి పథకాలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు భరోసానిస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలతో పాటు ఇతర పార్టీల నాయకులు సైతం ఆకర్శితులవుతున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు చెందిన 707 ప్రతినిధులతో పాటు ఇతర పార్టీలకు చెందిన 35 మంది నాయకులు టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేశారు.
ఇతర పార్టీల వారూ టీఆర్ఎస్కు ఓటు వేశారు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు కూడా టీఆర్ఎస్కు ఓటు వేశారని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో జరిగిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. నాయకులు, టీఆర్ఎస్ శ్రేణులు సమష్టి కృషితో భారీ విజయం సాధించామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు ఆదరిస్తున్నారని, ప్రజల ఓట్లతో గెలిచిన స్థానిక సంస్థల ప్రతినిధులు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు పట్టం కట్టారన్నారు. టీఆర్ఎస్కు 707 ఓట్లు ఉంటే 35 ఓట్లు అధికంగా వచ్చినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో 45 ఓట్లు చెల్లకుండా పోయాయని ప్రజాప్రతినిధులు సక్రమంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
ఈ విజయం కేసీఆర్‌కు అంకితం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ తనకు అవకాశం కల్పించారని, ఈ విజయం ఆయనకు అంకితం చేస్తున్నానని ఎమ్మెల్సీ దండె విఠల్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మధ్యాహ్నం ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సనత్‌నగర్ నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అవకాశంతో ఈ రోజు ఎమ్మెల్సీగా ఎన్నికై జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందన్నారు. ఈ ఎన్నికల్లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, జడ్పీ, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు తనకు ఎంతో సహకారం అందించారన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణుల సమష్టి కృషితోనే ఘన విజయం సాధించినట్లు తెలిపారు. స్థానికంగా ఉంటూ అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అందరి సహకారంతో జిల్లా మరింత అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలో నాయకులు, ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీ పటిష్టానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
భారీ మెజార్టీతో విజయం సాధించిన ఎమ్మెల్సీ దండె విఠల్‌ను పలువురు అభినందించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న, రాథోడ్ బాపురావ్, విఠల్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, టీడీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి కౌంటింగ్ కేంద్రానికి చేరుకొని దండె విఠల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సన్మానించి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం జరిగిన విజయోత్సవ సభలో ఎమ్మెల్సీ సతీశ్, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, రేఖానాయక్, మున్సిపల్ చైర్మన్లు జోగు ప్రేమేందర్, గండ్రత్ ఈశ్వర్, ఇతర ప్రజాప్రతినిధులు అభినందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంపై జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు
సంబురాలు జరుపుకున్నాయి.