కుమ్రంబీమ్ ఆసిఫాబాద్ : కాగజ్ నగర్ టైగర్ కన్జర్వేషన్ (Tiger Conservation) రిజర్వ్ రద్దు కోసం ఆదివాసీలు ( Tribals Protest ) జిల్లా కేంద్రంలో ఆందోళన నిర్వహించారు. గత నెల 30న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్‌గా ప్రకటించి జారీ చేసిన జీవో 49 ను ఉపసంహరించుకోవాలని ఆదివాసీలు శనివారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లో తుడుం దెబ్బ ( Tudumdebba ) ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద బైటాయించి నిరసన వ్యక్తం చేశారు.
టైగర్ జోన్ పేరిట ఆదివాసీలను వెళ్లగొట్టే ప్రయత్నాల్ని అడ్డుకుంటామని, దశాబ్దాలుగా అడవిని నమ్ముకుని బతుకుతున్న ఆదివాసీలకు అన్యాయం చేస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అడవులను కాపాడడం, పులులను సంరక్షించడం పేరిట ప్రభుత్వం అటవీ శాఖ చేస్తున్న కుటిల ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు.
ఆదివాసీలు, బడుగు బలహీన వర్గాల ప్రజల మీద అటవీ శాఖ అధికారుల దౌర్జన్యాలు వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ప్రజలంతా ఏకం అవుతున్నారని అన్నారు. జీవో నంబర్ 49 రద్దు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ముందుగా కుమ్రంభీం ,అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించి ,అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆదివాసీల ఆందోళనకు మద్దతు పలికారు.