ఉట్నూర్ : ఉమ్మడి జిల్లాలోని గిరిజనుల (Tribals protest ) సమస్యలను వినకుండా అవమానిస్తున్న ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (ITDA PO) కుష్బూ గుప్తాపై చర్యలు తీసుకోవాలని ఆదివాసి సంఘాల నాయకులు ( Adivasi Leaders ) పేర్కొన్నారు. గురువారం ఉట్నూరు మండల కేంద్రంలోని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి క్యాంపు కార్యాలయంలో ఆదివాసీ సంఘాల నాయకులు వివిధ సమస్యలపై పీవో తో చర్చించడానికి రాగా వీడియోలు తీయించడం శోచనీయమని అన్నారు.
ఇదేమిటని ప్రశ్నిస్తే సమావేశంలో ఉంటే ఉండాలి లేకపోతే వెళ్లిపోవచ్చని అనడంతో సమావేశాన్ని బైకాట్ చేసి రోడ్డుపై బైఠాయించామని తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పురక బాపురావు లు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మడవి ప్రసాద్, ఎస్సై ప్రవీణ్ అక్కడికి చేరుకుని రోడ్డుపై బైఠాయించిన ఆదివాసి నాయకులను తొలగించారు.
ఈ సందర్భంగా గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులు దేవేందర్, మెస్రం శేఖర్ మాట్లాడుతూ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గిరిజనుల సమస్యలు వినే ఓపిక లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. పీవో వైఖరిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో తుడుం దెబ్బ, ఆదివాసి విద్యార్థి సంఘం, ఏజెన్సీ డీఎస్సీ సాధన సమితి, ఆదివాసి గిరిజన ఉద్యోగుల సంఘంనాయకులు పాల్గొన్నారు.