ఇంద్రవెల్లి : ఆదివాసుల (Tribal) సంప్రదాయం ప్రకారం ఇంద్రవెల్లి( Indravelli) మండలంలోని ఇంద్రాదేవి ఆలయంలో వానాకాలం విత్తనాల పూజలు (Tribal seed worship) మొదలయ్యాయి. ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో ఆదివారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంతోపాటు ఉట్నూర్( Utnoor ) , నార్నూర్, గూడిహత్నూర్, సిరికొండ మండలాలకు చెందిన ఆదివాసీ గిరిజనులు కుటుంబ సమేతంగా ఇంద్రాదేవి ఆలయానికి భారీగా చేరుకున్నారు.
ఆలయంలో అన్ని రకాల విత్తనాలకు పూజలు నిర్వహించారు. అనంతరం విత్తనాలతోపాటు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వానాకాలంలో సాగు చేసే పంటలు బాగా పండాలని మొక్కుకున్నారు. ఆలయం ఆవరణలో వంటలు చేసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.