నస్పూర్, మార్చి 31 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన గిరిజన యువతి బానావత్ వనజ గ్రూప్-1 ఫలితాల్లో రాష్ట్రస్థ్ధాయిలో 38వ ర్యాంకు సాధించింది. రైతు బానావత్ దశరధ్ -లలిత దంపతుల మూడో కుమార్తె వనజ కష్టపడి చదివి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొదటి ర్యాంకు తెచ్చుకున్నది. దండేపల్లిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసింది. ఐటీడీఏ స్కాలర్‌షిప్‌తో కరీంనగర్‌లోని ఆల్ఫోర్స్ కాలేజీలో ఇంటర్ ఇంగ్లిష్ మీడియం పూర్తి చేసింది. కాకతీయ యూనివర్శిటీలో డిగ్రీ, పీజీ చదివింది. మూడేళ్లుగా హైదరాబాద్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్లో చేరి సివిల్స్‌కు సిద్ధమైంది.
టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-4 పరీక్షలో ఎస్టీ విభాగంలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించి కమర్షియల్ టాక్స్ డిపార్టుమెంట్లో ఉద్యోగం సాధించింది. తర్వాత జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల్లో ర్యాంకు సాధించింది. వారం క్రితమే వరంగల్ జూనియర్ కళాశాలలో ఉద్యోగంలో చేరింది. ఇప్పుడు గ్రూప్-1 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 504.5 మార్కులు సాధించి 38వ ర్యాంకు తెచ్చుకున్నది. వనజకు డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం వస్తుందని భావిస్తున్నారు. వనజను కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు, స్థానికులు ఆమెను అభినందించారు.