ఉట్నూర్, జూన్17: రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధి కళ్ల ముందే కనిపిస్తున్నదని రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన గిరిజన దినోత్సవానికి మంత్రి హాజరయ్యారు. గిరిజనులు గుస్సాడీ నృత్యాలతో ఘనంగా స్వాగతం ఫలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడిన వీరుడు కుమ్రం భీం అని కొనియాడారు. భీం ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు.గూడేలు,తండాలను జీపీలుగా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. తండాలను గిరిజనులే పాలించుకుంటున్నారని చెప్పారు. కొత్త జీపీలకు భవనాలు కూడా మంజూరయ్యాయన్నారు. ఎన్నో ఈనెల 24 నుంచి పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తున్నామన్నారు. ఒకప్పుడు ఏజెన్సీలో వర్షాకాలం వచ్చిందంటే గిరిజన మరణాలు అధికంగా ఉండేవని చెప్పారు.
కేసీఆర్ సీఎం కాగానే ఏజెన్సీపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. జోడెఘాట్‌లో రూ. 50 కోట్లతో మ్యూజియం, బీటీ రోడ్లు, గిరిజనులకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఆసిఫాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేసి కుమ్రం భీం పేరు పెట్టారని గుర్త చేశారు. ఉమ్మడి జిల్లాకు నాలుగు మెడికల్ కళాశాలలు మంజూరు చేశామన్నారు. గిరిజనుల అభ్యున్నతికి రిజర్వేషన్లను 10 శాతానికి పెంచారని తెలిపారు. కెస్లాపూర్ నాగోబా దేవాలయానికి ఎండోమెంట్ నుంచి రూ. 12 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. ఖానాపూర్ నియోజకవర్గానికి 3వేల ఇండ్లు రానున్నాయని తెలిపారు. హరితహారంలో ఇచ్చోడ మండలం ముక్రా గ్రామానికి దేశంలోనే మూడో స్థానం రావడం గర్వకారణం అన్నారు. ఉట్నూర్ ప్రభుత్వ దవాఖానను జిల్లా వైద్యశాలగా మార్చి అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.
సీఎ కేసీఆర్‌తోనే అభివృద్ధి
రాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆర్ తోనే సాధ్యమవుతున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ తెలిపారు. పల్లెప్రగతి, హరితహారం పథకాలతో గ్రామాలు పచ్చతోరణాలుగా మారుతున్నాయని చెప్పారు. ఒకప్పుడు గిరిజనులు చెలిమె నీరు తాగేందుకు బిందేలు తీసుకెళ్లేవారని, ఇప్పడు ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు వస్తుందన్నారు.
గిరిజనుల అభ్యున్నతికి కృషి
గిరిజనుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు కేసీఆర్ పుణ్యమేనని చెప్పారు. ప్రతిపక్షాలకు అభివృద్ధి కనిపించడం లేదని మండిపడ్డారు.
తొమ్మిదేళ్లలో ఎంతో అభివృద్ధి
తొమ్మిదేళ్లలో ఏజెన్సీలోని గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి అన్నారు. గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. ఉట్నూర్ ప్రభుత్వ దవాఖానను జిల్లా వైద్యశాల మార్చి సౌకర్యాలు కల్పిస్తే ఇటీవల రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి ముస్కాన్ ర్యాంక్ సాధించిందని గుర్తు చేశారు. గిరివికాసం పథకం ద్వారా గిరిజన రైతులకు మేలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్, ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావు, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి, జడ్పీటీసీ చారులత, ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరాం, కందుకూరి రమేశ్, అహ్మద్ అజీం, రషీద్, మర్సకోల తిరుపతి, బొంత ఆశారెడ్డి, రాజేశ్ పాల్గొన్నారు.