మంచిర్యాలటౌన్, మే 20 : మంచిర్యాల పట్టణంలోని రాళ్లవాగు నాలా శిఖం సర్వేనంబర్ 140లోని రెండెకరాలను ఆక్రమించుకునేందుకు కొందరు ప్రయత్నించారు. ఏకంగా ప్రభుత్వ స్థలంలో నాటిన చెట్లను తొలగించి బ్లేడ్ ట్రాక్టర్లతో చదును చేయించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఆ ప్రభుత్వ భూమిని చదును చేస్తున్న రెండు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొని సీజ్ చేశారు. ఈ స్థలంలో ఎవరు చదును చేయమన్నారని అధికారులు అడిగిన ప్రశ్నలకు ట్రాక్టర్ డ్రైవర్లు సమాధానం ఇవ్వకుండా పారిపోయారు. మంచిర్యాల పట్టణంలోని ఆర్ఆర్ నగర్ శివారులోని రెండెకరాల రాళ్లవాగు నాలా శిఖం భూమిని చాలా ఏళ్లుగా పలువురు కబ్జాచేయాలని యత్నిస్తున్నారు.
పలుమార్లు కబ్జారాయళ్లు చేసిన ప్రయత్నాలను అధికారులు తిప్పికొట్టారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ భూమిని తరచూ కబ్జా చేసేందుకు యత్నిస్తుండగా, రెండేళ్ల క్రితం చెట్ల పెంపకం కోసమని మున్సిపాలిటీకి అప్పగించారు.
ఈ రెండెకరాల్లో పట్టణ ప్రకృతివనం పేరుతో మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. తాజాగా.. ఆదివారం సెలవు దినాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు కబ్జారాయుళ్లు అక్కడున్న చెట్లను తొలగించి, బ్లేడ్ ట్రాక్టర్ల సాయంతో చదును చేయించారు.
విషయం తెలుసుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ అజీజ్ తమ సిబ్బందితో కలిసివెళ్లి అక్కడ నడుస్తున్న ట్రాక్టర్లను తహసీల్ కార్యాలయానికి తరలించి సీజ్చేశారు. సోమవారం సాయంత్రం వరకు ట్రాక్టర్లకోసం సంబంధిత యజమానులెవ్వరూ కార్యాలయానికి రాలేదు. కాగా, పట్టణానికి చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఒక మున్సిపల్ కౌన్సిలర్ కలిసి ఈ భూమి ఆక్రమణకు యత్నించినట్లు పట్టణంలో ప్రచారం జరుగుతుంది. కాగా, సోమవారం ఆ స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్, తహసీల్దార్ రమేశ్, ఆర్ఐ అజీజ్, సిబ్బంది పరిశీలించారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు తెలియపరుస్తామని వారు తెలిపారు.