రెబ్బెన : యువతుల బాధలు కొన్ని చెప్పుకోలేనివి. కాని పరిష్కారం కానివి కావు. వారిలో ఆరోగ్యపరంగా చైతన్యం తీసుకురావడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నా కూడా వాటి పట్ల అవగాహన లేని కొందరు ఆత్మహత్యకు పాల్పడుతూ కుటుంబంలో విషాదం నింపుతున్నారు. అదే కోవలో ఓ యువతి రజస్వల (Menstruating) కాలేదన్న బెంగతో ఆత్మహత్య (Suicide) చేసుకున్న విషాద ఘటన ఆసిఫాబాద్ (Asifabad district ) జిల్లా రెబ్బెన మండలంలో చోటు చేసుకుంది.
రెబ్బెన ఎస్సై చంద్రశేఖర్ ( SI Chandra Shekar ) తెలిపిన వివరాల ప్రకారం. మండలంలోని గోలేటి గ్రామపంచాయతీ పరిధిలో చింతకుంట్ల పోచంకు నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు చింతకుంట్ల సంధ్య (22) కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. అయితే ఇంతవరకు రజస్వల కాలేదన్న కారణంగా తల్లిదండ్రులకు చెబుతూ బాధపడింది. ఆమెకు వారు అనేక సార్లు ధైర్యం చెప్పినా కూడా తీవ్ర మనస్తాపానికి గురై ఇంటిలో ఆదివారం రాత్రి పురుగుల మందు సేవించింది.
ఆమెకు తీవ్ర వాంతులు కావడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారని ఎస్సై వెల్లడించారు. తండ్రి చింతకుంట్ల పోచం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.