ఆదిలాబాద్, జూలై 30(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాలలో బుధవారం వైద్య విద్యార్థి ఆత్మహత్యతో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌కు చెందిన సాహిల్ చౌదరి(19) రిమ్స్‌లో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. హాస్టల్ గదిలో తోటి స్నేహితుల తో కలిసి ఉంటున్నారు. ఆగస్టు రెండు నుంచి ఫైనల్ పరీక్షలు ఉండడంతో సన్నద్ధం అవుతున్నాడు. ఉదయం సహచర విద్యార్థులు బయటకు వెళ్లగా సోహిల్ ఒక్కడే హాస్టల్ గదిలో ఉ న్నాడు. గదిలోని ఫ్యాన్‌కు టవల్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తోటి విద్యార్థు లు గమనించి వైద్యం కోసం రిమ్స్‌కు తరలించారు. వైద్యులు సాహిల్‌కు బతికించేందుకు ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది. ఆత్మహత్య విషయం తెలుసుకున్న రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, టూటౌన్ సీఐ కరుణాకర్ రావు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు ఫోన్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి నలుగురు రిమ్స్ అధ్యాపకులతో కమిటీ వేసినట్లు డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు.
తమ తోటి విద్యార్థి హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడడంతో వైద్య కళాశాల విద్యార్థులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. పెద్దసంఖ్యలో మార్చురికి చేరుకున్నారు. తమ స్నేహితుడి మరణం జీర్ణించుకోలేని పలువురు విద్యార్థులు రోదించారు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణుడైన సాహిల్ చౌదరి అందరితో కలిసి మెలసి ఉండేవాడని గుర్తు చేసుకున్నారు.
సాహిల్ చౌదరి ఆత్మహత్య చేసుకోవడం బాధకరమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రిమ్స్‌ను సందర్శించిన ఆయన విద్యార్థులతో మాట్లాడి ఘటన వివరాలను తెలుసుకున్నారు. వసతి గృహంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామనని హామీ ఇచ్చారు.
సాహిల్ చౌదరి కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని బీఆర్ఎస్వీ ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ శివకుమార్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన రిమ్స్ వసతిగృహాన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా మెడికల్ కళాశాలలను ప్రారంభించడమే కాకుండా అన్ని వసతులు సమకూర్చినట్లు తెలిపారు.