లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధి ఊతూర్ చౌరస్తా వద్ద గల 63వ జాతీయ రహదారిపై ప్రతీ గురువారం నిర్వహించే వారసంత.. ప్రయాణికులకు చింత తెచ్చిపెట్టింది. రోడ్డుపైనే నిర్వహిస్తుండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతున్నది. దీంతో వర్తకులు, వినియోగదారులు, వాహనదారులు, ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ప్రమాదకరమని తెలుస్తున్నా అధికారులు, నాయకులు, మున్సిపాలిటీ పాలకవర్గం పట్టించుకోకపోవడంతో సమస్య మరింత జఠిలంగా తయారైంది.
– లక్షెట్టిపేట, జూన్ 8
లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధి ఊతూర్ చౌరస్తా వద్ద గల 63వ జాతీయ రహదారిపైనే వారసంత నిర్వహిస్తుండడంతో వాహనాల రద్దీ అధికంగా ఉంటున్నది. రహదారికి ఇరువైపులా వ్యాపారులు, వర్తకులు, అలాగే పండ్ల వ్యాపారులు తోపుడు బండ్లపై అమ్మకాలు కొనసాగిస్తుండడంతో ట్రాఫిక్ సమస్య మరింత పెరిగింది. గురువారం వచ్చిందంటే చాలు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రహదారి గుండా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకడ నెలకొన్న సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నామని, జాతీయ రహదారిపై వారసంత ఏర్పాటు ప్రమాదకరమైనదని సంతకు వచ్చే వినియోగదారులు, ప్రజలు చెబుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీ పాలకవర్గం పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. సంతకు వచ్చే వర్తకులు, వినియోగదారులకు మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం కూడా లేక అవస్థలు పడుతున్నారు. వాహనాల పారింగ్కు కూడా స్థలం లేకపోవడంతో వినియోగదారులు అడ్డదిడ్డంగా వాహనాలు నిలిపివేస్తున్నారు. ఏదేమైనా ప్రతీ గురువారం నిర్వహించే వారసంతను ఇబ్బందిలేని ప్రదేశాలు గుర్తించి ఏర్పాటు చేయాలని, ఎలాంటి ప్రమాదాలు జరుగకముందే సంబంధిత అధికారులు దృష్టిపెట్టాలని ప్రజలు కోరుతునారు.
కూరగాయల సంత రోడ్డుపైనే నిర్వహిస్తుండడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహనాల పార్కింగ్‌కు, వ్యాపారులు తమ బండ్లు పెట్టేందుకు స్థలంలేకపోవడంతో రోడ్డుపైనే నిలుపుతున్నారు. ప్రధాన రహదారి కావడంతో ప్రతీ గురువారం సంతతో రాకపోకలకు కష్టమవుతున్నది. వేరే చోట స్థలం కేటాయించి, కూరగాయల సంతను అక్కడికి మార్చాలి.
లక్షెట్టిపేట మున్సిపాలిటీలో గురువారం వారసంత జాతీయ రహదారిపై నిర్వహిస్తున్న మాట వాస్తవమే. దీంతో ప్రజలు, స్థానికులు, వినియోగదారులు ఇబ్బందులుపడుతున్నారని మా దృష్టికి వచ్చింది. వ్యాపారులు, వినియోగదారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. స్థానిక పోలీసుల సమన్వయంతో చర్యలు చేపడతాం. సంతను అనుకూలమైన ప్రదేశానికి తరలించేందుకు ప్రయత్నం చేస్తాం.