తాండూర్ : మంచిర్యాల జిల్లా తాండూర్ ( Tandur ) మండలం రేచిని గ్రామపంచాయతీ పరిధి బారెపల్లి గ్రామానికి చెందిన కోట్రంగి జయరాం(40) అనే ట్రాక్టర్ డ్రైవర్(Tractor Driver) వడదెబ్బతో మృతి చెందినట్లు తాండూర్ ఎస్సై కే ప్రసాద్ తెలిపారు. శుక్రవారం పని నిమిత్తం బెల్లంపల్లి వెళ్లి ఎండ దెబ్బకు గురై మధ్యాహ్నం ఇంటికిరాగా సాయంత్రం వాంతులు, విరేచనాలు అయ్యాయని వివరించారు.
అదే రాత్రి 11గంటలకు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల వెళ్లాలని సూచించారని వెల్లడించారు. మంచిర్యాల తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడని పేర్కొన్నారు. మృతుని భార్య నీలబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవ పంచనామ నిర్వహించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.