దండేపల్లి, డిసెంబర్ 21 : మంచిర్యాల జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. రెండేళ్లుగా ఆర్థిక సంక్షభంలో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలు కొత్త పాలక వర్గాలకు సవాళ్లుగా మారబోతున్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీ పగ్గాలు చేపట్టబోతున్న కొత్త పాలక వర్గాలన్ని 15వ ఆర్థిక సంఘం నిధులైనే ఆశలు పెట్టుకున్నాయి.
ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు..
సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ నవంబర్ 25న జిల్లాలోని సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేసింది.మూడు విడుతల్లో ఎన్నికలు నిర్వహించింది.అనివార్య కారణాల వల్ల గూడెం, వందూర్‌గూడ, నెల్కివెంకటాపూర్ గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించలేదు. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ నెల 22న ఉదయం చేపట్టనున్నారు. మంచిర్యాల జిల్లాలోని 303 గ్రామ పంచాయతీల్లో ఒకే సమయంలో ప్రమాణ స్వీకారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.కొత్తగా ఎన్నికైన అభ్యర్థులతో ప్రత్యేక అధికారులు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.అదే రోజు నుంచి కొత్త పాలక వర్గాలు కొలువుదీరనున్నాయి.
పెండింగ్‌లో నిధులు..
తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018 ప్రకారం 2019లో పంచాయతీలో ఎన్నికలు నిర్వహించారు.ఆయా పాలక మండల్ల పదవీ కాలం 2024 జనవరితో ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతూ వచ్చింది. పాలక వర్గాలు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నుంచి పంచాయతీలు సహా పరిషత్‌లకు 2024-2025, 2025-2026 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆస్థి పన్నులు కూడా ఆశించిన స్థాయిలో వసూలు కాలేదు.
తండాలు, ఇతర చిన్న గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య కార్మికులకు వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కార్యదర్శులు చిన్న చిన్న అవసరాలకు అప్పులు చేయాల్సి వచ్చింది. ట్రాక్టర్లో డీజిల్ పోయించలేక చాలా గ్రామాల్లో చెత్త సేకరణ జరగక పారిశుధ్యం అస్తవ్యస్థంగా మారింది. చినీ రిపేర్లు కూడా చేయించలేక పంచాయతీ కార్యదర్శులు అనేక అవస్థలు ఎదుర్కొన్నారు. షెడ్డుకు చేరుకున్న ట్రాక్టర్లు మళ్లీ వీధుల్లో పరుగులు తీయాలన్నా, పేరుకుపోయిన చెత్తను ఎత్తిపోయాలన్నా ఎంతో కొంత నిధులు అవసరం. 15వ ఆర్థిక సంఘం నిధులపైనే కొత్త పాలక వర్గాలు గంపెడు ఆశలు పెట్టుకున్నాయి.
పేరుకుపోయిన సమస్యలు..
రెండేళ్లుగా గ్రామాల్లో పాలక వర్గాలు లేకపోవడంతో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఎక్కడా కూడా అభివృద్ధి పనులు చేపట్టలేదని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ సైతం చేపట్టలేని దుస్థితి. ట్రాక్టరు కిస్తీలు రెండేళ్లుగా అలాగే పెండింగ్‌లో ఉన్నాయి. డ్రైనేజీను శుభ్రం చేయించలేని పరిస్థితి. ఇవన్ని నూతన సర్పంచులకు సవాళ్లుగా మారనున్నాయి.
ముఖ్యంగా గ్రామాల్లో కోతులు, వీధి కుక్కలు వీర విహారం చేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతనెల 17న దండేపల్లి మండల కేంద్రంలో ఒకే రోజు ముగ్గురు మహిళల పైనే వీధి కుక్కలు దాడి తీవ్రంగా గాయపర్చాయి. రెండు నెలల వ్యవధిలోనే 56 మందిని గాయపర్చడం గమనార్హం. పశువుల కూడా కుక్కకాటుకు గురై మరణించిన సంఘటనలు ఉన్నాయి.కొన్ని గ్రామ పంచాయతీ భవనాలు నిధులు లేక మద్యలోనే నిర్మాణ పనులను ఆపేశారు.ఇక ఎన్నికల సందర్భంగా సర్పంచులు ఇచ్చిన హామీలు కూడా వారికి సవాల్‌గా మారనున్నాయి. సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్న సర్పంచులకు ఈ సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.