అప్పటికి ఇంకా దేశానికి స్వాతంత్య్రం రాలేదు. బ్రిటిష్ తెల్లదొరలు, నిజాం నవాబులు పాలిస్తున్న రోజులవి. 1935లో జనగాం(ఆసిఫాబాద్) జిలా ్లకేంద్రంగా ఉన్నప్పుడు అడవులను నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసీలపై నిజాం సర్కార్ పాశవిక చర్యలకు పాల్పడింది. ‘జల్, జంగల్, జమీన్’ నినాదంతో నిజాం సర్కారుపై భీకరంగా పోరాడి వీర మరణం పొంది ఆదివాసుల గుండెల్లో కుమ్రం భీం చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఆ మహనీయుడు త్యాగాల ఫలితంగా ఆదివాసీలకు హక్కులు సిద్ధించాయి. నేడు ఆదివాసీ ముద్దు బిడ్డ.. గోండు బెబ్బులి కుమ్రం భీం 84వ వర్ధంతి సందర్భంగా కథనం.
Komaram Bheem | కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/కెరమెరి, అక్టోబర్ 16: ఆసిఫాబాద్ మండలం సంకెపల్లిలో గోండు తెగ కు చెందిన కుమ్రం చిన్నూ దంపతులకు 1901సంవత్సరంలో కుమ్రం భీం జన్మించాడు. భూ పట్టాదారులు, అటవీ సిబ్బంది చిత్రహింసలతో గ్రామస్తులతో పాటు భీం కుటుంబం కూడా ఇబ్బందులు పడ్డది. ఈ క్రమంలో భీం తండ్రి చిన్నూ మరణించడంతో ఆ కుటుంబం కెరమెరి మండలం సుర్దాపూర్‌కు వలస వచ్చింది. అడవిని నరికి పోడు వ్యవసా యం ప్రారంభించారు.
పంట చేతికి వచ్చే తరుణంలో సిద్ధిఖ్ అనే పట్టాదారుడు వచ్చి భూమి తనదేనంటూ ఆదివాసులు పండించిన పంటలు తనకే దక్కాలంటూ భయభ్రాంతులకు గురిచేశాడు. అతని అరాచకాలు భరించలేని ఆదివాసీలు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. వేధింపులను భరించలేక భీం కర్రతో దాడి చేయగా సిద్ధిఖ్ అక్కడికక్కడే హతమయ్యా డు. నిజాం పోలీసులు భీంపై హత్య నేరం మోపగా భీం బాల్య స్నేహితుడు కొండల్ తో బల్లార్షా, చంద్రాపూర్ వైపు పయనమయ్యాడు.
అక్కడి నుంచి అస్సాం వెళ్లి తే యాకు తోటలో పని చేశాడు. రాంజీగోం డు, అల్లూరిసీతారామారాజుల పోరాటాన్ని ఆదర్శంగా తీసుకుని సుర్దాపూర్‌కు తిరిగి వచ్చాడు. బాబేఝరిలో పోడు వ్యవసా యం ప్రారంభించాడు. నిజాం పోలీసులు అటవీ సిబ్బంది అక్కడికి వెళ్లగా భీం వారిపై ఎదురు తిరిగి పంపించాడు. బాబేఝరి భూసమస్య నిజాం ప్రభుత్వానికి, భీం మధ్య వివాదంగా మారి యుద్ధానికి దారితీసింది. జోడేఘాట్ కేంద్రంగా చుట్టుపక్కల 12 గ్రామాల ఆదివాసులను భీం ఏకం చేశా డు. గెరిల్లా తరహా పోరాటాలకు వారిని సిద్ధం చేశాడు. ‘జల్, జంగల్, జమీన్’ నినాదంతో పోరాటానికి భీం నాంది పలికారు.
నిజాం ప్రభుత్వం అప్పటి ఆసిఫాబాద్ కలెక్టర్‌ను రాయబారానికి జోడేఘాట్‌కు పం పింది. 12 గ్రామాలకు స్వాతంత్య్రం ప్రకటించాలని జైలులోని తన అనుచరులను వ దిలిపెట్టాలని భీం షరతులు విధించాడు. దీ నికి అంగీకరించని నిజాం సర్కార్ సైన్యాన్ని దింపింది. ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతో జోడేఘాట్‌కు అర్ధరాత్రి చేరుకొని నిద్రిస్తున్న భీం అనుచరులపై ఏకపక్షంగా కాల్పులకు పాల్పడింది. భీం సేన పోరాటానికి దిగగా చివరికి నిజాం పోలీసుల తూటాలకు 1940 ఆశ్వీయుజ మాసం పౌర్ణమి రోజున కుమ్రం భీం వీరమరణం పొందాడు.
అనంతరం ఆదివాసీల సమస్యలు, జీవనస్థితిని పరిశోధనకు నిజాం ప్రభుత్వం ఇంగ్లాండ్‌కు చెందిన సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ హేమన్‌డార్ఫ్‌ను నియమించింది. దీంతో ఆయన తన సతీమణి ఎలిజబెత్‌తో ఆదివాసుల మధ్య నివాసముంటూ నివేదికను ప్రభుత్వానికి పంపించారు. ఆ నివేదికకు స్పందించిన అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలు సాగుచేస్తున్న భూములకు పట్టాలు ఇచ్చి ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యం, హక్కులు కల్పించాయి.
జోడేఘాట్‌లో వర్ధంతికి ఏర్పాట్లు పూర్తి
జోడేఘాట్‌లో కుమ్రం భీం వర్ధంతి వేడుకలకు భీం విగ్రహం, సమాధిని అలంకరించారు. దర్బార్ కోసం వేదిక, ప్రజల కోసం టెంట్లు, తాగునీరు, భోజన వసతి, వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. హెలీ ప్యా డ్ నుంచి భీమ్ స్మృతి చిహ్నం, మ్యూజి యం, సభ వేదిక వరకు బారికేడ్లు నిర్మించారు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాం తాల నుంచి ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు.
కార్యక్రమానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క(ధనసరి అనసూయ), ఆసిఫాబాద్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, వెడ్మ బొజ్జు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఉమ్మడి జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు హాజరుకానున్నారని ఉత్సవ కమిటీ చై ర్మన్ రాజేశ్వర్ తెలిపారు. ముగ్గురు డీఎస్పీ లు, 15 సీఐలు, 28మంది ఎస్ఐలు, 460 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. జోడేఘాట్‌లో సంప్రదాయబద్ధంగా బుధవారం రాత్రి భీం వారసులు, ఆదివాసీలు ఊరేగింపుగా తరలివచ్చి, భీం స్మృతి చిహ్నం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం కుమ్రం భీం మనుమడు సోనేరావ్ ఆధ్వర్యంలో అవ్వల్ పేన్ వద్ద పూజలు చేశారు.