కోటపల్లి, మే 25 : ఆపదలోనున్న వారికి మేమున్నామంటూ భరోసానిస్తున్నది 108 సిబ్బంది. సకాలంలో స్పందించి.. ప్రాణాలు రక్షించి.. వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్న అంబులెన్స్ ఉద్యోగుల సేవలపై అంతర్జాతీయ పైలెట్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం..
నిత్యం సవాళ్లను ఎదుర్కొంటూ..
ఆపత్కాలంలో క్షణాల్లో ముందుండి ప్రాణాలను కాపాడే 108 సిబ్బంది సేవలను ఎంత కొనియాడినా తక్కువే. అంబులెన్స్ సకాలంలో ఘటనా స్థలానికి చేరాలన్నా.. అక్కడి నుంచి దవాఖానకు చేరాలన్నా పైలెట్ అప్రమత్త త ముఖ్యం. ప్రమాద స్థలం నుంచి హాస్పిటల్‌కు తీసుకువచ్చే సమయాన్ని గోల్డెన్ అవర్‌గా భావిస్తారు. ఆ సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అత్యవసర సమయాల్లో వాహనాన్ని జాగ్రత్తగా నడుపకుంటే.. బాధితులతో పాటు పైలెట్, ఈఎంటీలకు ప్రమాదమే.. నిత్యం అనేక సవాళ్లను ఎదుర్కొంటూ వందలాది మందికి ఊపిరిపోస్తున్న అంబులెన్స్ సిబ్బందికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం..
కొవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి..
108 సిబ్బంది.. కొవిడ్ సమయంలో ప్రమాదమని తెలిసినా కరోనా బాధితులకు వైద్య చికిత్సలు అందించి ప్ర శంసలు అందుకున్నది. 24 గంటల పాటు అప్రమత్తం గా ఉంటూ కరోనా లక్షణాలు కలిగిన వారికి మెరుగైన వై ద్యం అందించేందుకు నిరంతరం కృషి చేసింది. కొవిడ్ రోగులు, అనుమానితులను హాస్పిటల్స్‌కు తీసుకుపోవ డం, ఐసొలేషన్‌కు తీసుకురావడంలో వారి పాత్ర మరవలేనిది. అంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ 108 సిబ్బంది రోగులకు సేవలు అందించి భేష్ అనిపించుకున్నది.
ఏటా పైలెట్లకు ప్రత్యేక శిక్షణ
108 పైలెట్లకు హైదరాబాద్‌లోని జీవీకే ఈఎంఆర్ఐ కార్యాలయంలో ఏటా ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిని వారికి ప్రథమ చికిత్స చేయడం.. గర్భిణులకు సుఖ ప్రసవం చేయడం.. గుండెపోటు వస్తే సకాలంలో వైద్యం అందించడంవంటి పలు అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు.

ఉమ్మడి జిల్లాలో 140 మంది పైలెట్లు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 108 అంబులెన్స్‌లలో మొత్తం 140 మంది పైలెట్లు విధులు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో 15 వాహనాలు ఉండగా, 40 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 19 వాహనాలు ఉండగా, 45 మంది, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 14 వాహనాలు ఉండగా, 30 మంది, నిర్మల్ జిల్లాలో 9 వాహనాలు ఉండగా, 25 మంది పైలెట్లు పనిచేస్తున్నారు.
కరోనా సమయంలో భయపడకుండా సేవలందించాం
కొవిడ్ సమయంలో భయపడకుండా బాధ్యతగా సేవలందించాం. కరోనా రోగులను పక్కన పెట్టుకొని పనిచేయడం ప్రమాదమే. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో సేవలందించాం. విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఎలాంటి కేసులు వచ్చినా చాలెంజ్‌గా తీసుకొని పని చేస్తుంటాం. ప్రజలు మాపై చూపుతున్న ఆదరాభిమానాలు ఆనందాన్నిస్తాయి.
– ఎండీ వసీమ్, ఆదిలాబాద్
సంతృప్తిగా ఉంది
అంబులెన్స్‌లో 16 ఏళ్లుగా ఈఎంటీగా పనిచేస్తున్న. ఆపద సమయంలో ఘటనా స్థలానికి వెళ్లి.. అంతకు రెట్టింపు వేగంతో బాధితులను దవాఖానకు చేర్చడం మాకు సవాల్లాంటిది. విధి నిర్వహణలో భాగంగా ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నం. ఇందుకు సంతృప్తిగా ఉంది.
– పూదరి తిరుపతి, రెబ్బెన, ఆసిఫాబాద్ జిల్లా
గోల్డెన్ అవర్ చాలా కీలకం
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను దవాఖానకు తీసుకురావడాన్ని గోల్డెన్ అవర్‌గా భావిస్తాం. ఎందుకంటే ఆ సమయంలో ప్రతి క్షణం చాలా విలువైనది. అప్పుడు పైలెట్ అప్రమత్తంగా లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తది. అందుకే అత్యంత అప్రమత్తంగా ఉండి సేవలందిస్తాం.
– మామిడి సత్యం, లక్షెట్టిపేట, మంచిర్యాల
కత్తిమీద సాములాంటిది
ప్రతి కేసు మాకు కత్తి మీద సాములాంటిదే. ఫోన్ రాగానే క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుంటాం. బాధితుడి ప్రాణాలు కాపాడడం మా బాధ్యతగా భావిస్తాం. సకాలంలో హాస్పిటల్‌కు చేర్పించడం వల్ల ఒకరి జీవితం నిలబడుతుంది. అందుకే 108 వాహనం వెళ్తున్నప్పుడు దారి ఇవ్వడానికి సహకరించాలి.
– కొత్తకాపు సతీశ్ కుమార్, నిర్మల్