ఎదులాపురం, డిసెంబర్ 24 : లోక రక్షకుడు ఏసు క్రీస్తు జన్మదినం సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని క్రైస్తవ ప్రార్థనా మందిరాలు ముస్తాబయ్యాయి. ఈనెల 25, 26 తేదీల్లో క్రిస్మస్ సంబరాలు జరగనుండగా అందుకోసం ఆయా చర్చిల్లో క్రైస్తవ మిషనరీలు భారీగా ఏర్పాట్లు చేశాయి. వివిధ ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవ మందిరాలను విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. పలు చర్చీల్లో ఏసు జనన వృత్తాంతాన్ని వివరిస్తూ బొమ్మల కొలువులను అందంగా తీర్చిదిద్దారు. క్రిస్మస్ ప్రార్థనల కోసం చర్చీల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏసు ప్రభువును స్వాగతిస్తూ చర్చీలు, ఇళ్ల ముందు నక్షత్ర దీపాలను ఏర్పాటు చేశారు. చర్చీల ఆవరణలో రంగురంగుల విద్యుద్దీపాలతో క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేయగా.. సిరీస్ లైట్ల వెలుగులో సాయం కాలం వేల చర్చీలు కొత్త అందాలను సంతరించుకుంటున్నాయి. పండగ రోజున ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వినాయక్ చౌక్ లోని రోమన్ క్యాథలిక్ చర్చితోపాటు రవీంద్రనగర్ సీఎస్ఐ చర్చీల్లో జరిగే ప్రార్థనలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.