హాజీపూర్ : విద్యార్థులకు నాణ్యమైన, సులభమైన విద్యను అందించేందుకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్( TLM) ఎంతగానో ఉపయోగపడుతుందని ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య( DEO Yadaiah ) అన్నారు. హాజీపూర్ మండలం సబ్బేపల్లి ఉన్నత పాఠశాలలో శుక్రవారం టీఎల్ఎం మేళాను తహసీల్దార్ శ్రీనివాస్ రావు దేశ్పాండే ప్రారంభించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఈవో మాట్లాడుతూ విద్యార్థులకు సులభమైన పద్ధతిలో , తక్కువ ఖర్చుతో , వివిధ పాఠశాలల ఆలోచన విధానాన్ని వేరే పాఠశాలలు పంచుకోవడానికి టీఎల్ఎం మేళాలు ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని మండల ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఉత్తమ ప్రదర్శన చేసిన టీఎల్ఎంలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి పోటు తిరుపతిరెడ్డి, జిల్లా సెక్టోరియల్ అధికారులు చౌదరి, సత్యనారాయణమూర్తి, విజయలక్ష్మి , సబ్బేపల్లి కాంప్లెక్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుధారాణి, ముల్కల్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశం, దొనబండ ప్రధానోపాధ్యాయులు కరుణాకర్, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు , రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.