ఎదులాపురం, మే 8 : రాబోయే బక్రీద్ పండుగను జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్‌లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ అధ్యక్షత వహించగా, వివిధ శాఖల అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న పశువుల సంతలు, బక్రీద్ పండుగ దృష్ట్యా ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, భద్రతా చర్యలు, సిబ్బంది మోహరింపుపై సమగ్ర సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.
చట్టవిరుద్ధంగా ఆవులు, దూడలను అక్రమ రవాణా, వధించడం పూర్తిగా నిషేధమని తెలిపారు. ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతర రాష్ర్టాలు, జిల్లాల నుంచి జంతువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 7 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిఘా ఉంచి, వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తామని తెలిపారు.
వాట్సాప్, ఫేస్ బుక్ తదితర మాధ్యమాల్లో విద్వేషాలను రెచ్చగొట్టేలా మార్ఫింగ్ ఫొటోలు, అసత్య ప్రచారాలు, ప్రేరేపిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందుకోసం జిల్లా పోలీస్ మీడియా మానిటరింగ్ సెల్ నిరంతర నిఘా కొనసాగిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు సిబ్బంది ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, సీఐలు బీ.సునీల్ కుమార్, నాగరాజు, పనిధర్, ముస్లిం మత పెద్దలు, ఖురేషి వర్గానికి సంబంధించిన వారు పాల్గొన్నారు.