కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : కొద్ది రోజులుగా కాగజ్నగర్ అడవులతో పాటు సిర్పూర్-టీ-మహారాష్ట్ర సరిహద్దుల్లో బెబ్బులి సంచరిస్తున్నది. అక్కడక్కడే రోడ్లపై.. పంట చేలల్లో తిరుగుతూ ప్రజలు, వాహనదారులను బెంబేలెత్తిస్తున్నది. మంగళవారం మహారాష్ట్రలోని వీరూర్ నుంచి సిర్పూర్ వైపు వచ్చే రహదారిపై దర్జాగా నడుచుకుంటూ వస్తుండగా, వాహనదారులు సెల్ఫోన్లలో చిత్రీకరించారు.
నాలుగు రోజుల క్రితం మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న అమృత గూడ, సిర్పూర్లోని హుడికిలి, గుండాయిపేట, చీలపల్లి గ్రామాల సమీపంలోని పంట చేలు, రోడ్డును దాటుతూ పులి కనిపించింది. సుమరు 20 రోజులుగా అక్కడక్కడే తిరుగుతూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రైతులు, కూలీలు చేలల్లోకి వెళ్లేందుకు జంకుతున్నారు. మహారాష్ట్రకు దాదాపు 10 కిలోమీటర్ల పరిధిలో సుమారు 10 గ్రామాల వరకు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో పులి సంచరిస్తుండడంతో ఎప్పుడు ఏమవుతుందోనని భయంభయంగా గడుపుతున్నారు.