మంచిర్యాల, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవులను పెద్ద పులులు జల్లెడ పడుతున్నాయి. సాధారణంగా చలికాలంలో తోడు కోసం తిరిగే పులులు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. మగ పులులు తమ సామ్రాజ్యం (టెరిటోరి) హద్దులను దాటుకుని ఆడపులులను వెతుకుంటు వెళ్తాయి. ఆడపులులు కూడా మగ తోడు కోసం సంచరిస్తుంటాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర నుంచి అక్టోబర్‌లో జానీ అనే పెద్దపులి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా అడవుల్లోకి ప్రవేశించింది. పశ్చిమ కనుమలుగా పేరున్న సహ్యాద్రి పర్వత ప్రాంతంలోని అడవిలో కొన్ని రోజులు మకాం వేసిన ఆ పులి ఆడతోడు కోసం గడిచిన 30 రోజుల్లో 300 కిలోమీటర్ల పైచిలుకు ప్రయాణం చేసింది.
నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్, కుంటాల, కుభీర్, నర్సాపూర్(జి), దిలావర్పూర్, పెంబీ మండలాల్లో తిరిగిన పులి కొన్ని రోజులుగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, నార్నూర్ అడవుల్లో తచ్చాడుతున్నది. ఉమ్మడి జిల్లాలోకి ప్రవేశించినప్పటి నుంచి ట్రాక్ చేస్తున్న అధికారులు.. వందల కిలోమీటర్లు మన అడవుల్లోనే తిరుగుతున్నట్లు చెప్తున్నారు. ఏడేండ్ల వయస్సున్న ‘జానీ’ తన ప్రయాణంలో ఐదు ఘటనల్లో పాడి పశువులపై దాడి చేసి చంపేసింది. మరో మూడు ఘటనల్లో పశువులపై దాడి చేసి గాయపరిచింది. తాజాగా.. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలోని ఖడ్కి అటవీ సమీపంలో పులి సంచరిస్తూ కనిపించింది. బుధవారం వేకువజామున కాలకృత్యాలకు వెళ్లిన గ్రామస్తులు పులిని చూసినట్టు తెలిపారు. అక్కడి నుంచి బురుకుంగూడ, లోకారి(కే), ధర్ముగూడ అటవీ ప్రాంతం నుంచి పులి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు.
మరోవైపు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలోనూ పెద్దపులుల కదలికలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ రేంజ్ అడవుల్లో నెలన్నర రోజులుగా సంచరించిన ఎస్-12 అనే మగ పులి ఇటీవలే ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి అడవుల్లోకి వెళ్లింది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలోని అడవుల్లో రెండు నుంచి మూడు మగ పులులు ఆడపులి తోడు కోసం సంచరిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. కాగా.. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ అడవుల్లోకి ఇటీవల మహారాష్ట్ర నుంచి రెండు పులులు వచ్చాయి. ఇందులో ఒకటి ఆడపులి ఉంది. కాకపోతే అది ఇక్కడే ఉందా? తిరిగి వెళ్లిపోయిందా? అన్న విషయాన్ని అధికారులు ధ్రువీకరించలేక పోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు మగపులులు, ఒక ఆడపులి తోడును వెతుక్కుంటూ అడవుల్లో సంచరిస్తున్నట్లు అధికారులు నిర్ధారిస్తున్నారు.
అటవీ శాఖ అధికారుల గణాంకాల ప్రకారం.. ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో పది నుంచి 12 పెద్ద పులులు స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాయి. వీటిలో రెండు ఆడ పులులు, ఏడు మగ పులులు ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి రెండు పులులు వచ్చాయి. దీంతో ఇప్పుడు కొత్తగా వచ్చిన మగ పులలకు ఇక్కడ ఆడతోడు దొరికే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు వచ్చిన పులులు ఇక్కడి అడవుల్లోనే కొంతకాలం ఉండే చాన్స్ ఉందంటున్నారు. పులులు వైల్డ్ ఎనిమల్స్ అయినప్పటికీ ఫ్యామిలీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తాయి. ఆడ, మగ పులి కలిసి పిల్లల్ని కన్నాక ప్రస్తుతం అవి ఉంటున్న టెరిటొరిని వారసత్వంగా పిల్లలకు అప్పగించి అవి వేరే చోటుకు వెళ్లిపోతాయి. పులి పిల్లలు పెరిగి, స్వయంగా వేట నేర్చుకునే వరకు వాటినే అంటిపెట్టుకుని ఉంటాయని అధికారులు చెప్తున్నారు.
ఈ క్రమంలోనే ఆడపులి కోసం మగపులి అన్వేషణ తీవ్రంగా ఉంటుంది. ఆడపులి అడవిలో తిరుగుతూ దాని శరీరం నుంచి ఒక ప్రత్యేకమైన సెంట్‌ను రిలీజ్ చేస్తాయి. ఆ స్మెల్‌ను మగ పులులు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా పసిగడుతాయని అధికారులు చెప్తున్నారు. నిర్మల్, ఆదిలాబాద్‌లో తిరిగిన జానీ అనే పెద్దపులి, మంచిర్యాలలో సంచరించిన ఎస్-12 పులి రెండూ ప్రస్తుతం ఆసిఫాబాద్ అడవుల వైపే వెళ్తున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన మగ పులి కూడా ఆసిఫాబాద్‌లో అడవుల్లోనే మకాం వేసింది.
మహారాష్ట్ర నుంచి వచ్చిన పులుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని ఫీల్డ్ డైరెక్టర్ టు టైగర్ ప్రాజెక్ట్(ఎఫ్డీపీటీ) శాంతారాం తెలిపారు. సీసీ కెమెరాలు, ఎనిమల్ ట్రాకర్స్ బృందాలను ఏర్పాటు చేసి పులల కదలికలను పసిగడుతున్నామన్నారు. ఫీల్డ్‌లో ఇబ్బందులు లేవన్నారు. కాకపోతే అడవుల్లో కొందరు అమర్చిన కరెంట్ తీగలతో కాస్త ఇబ్బందులు వస్తున్నాయి. సాధ్యమైనంత వరకు వాటిని గుర్తించి తొలగిస్తున్నాం. అనుమతి లేని కనెక్షన్లు ఏం ఉన్నా తీసివేసి, అనుమతి తీసుకోవాలని చెప్తున్నాం. ఒక్క ఆ విషయంలో తప్ప పులుల రక్షణలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. తోడు కోసం వెతుక్కుంటూ ఒక దగ్గరి నుంచి మరో దగ్గరికి వెళ్లే క్రమంలో ఎక్కడో చోట అటవీ సమీప ప్రాంతాలు, రోడ్లు దాటుతున్న సమయంలో జనాల కంట పడుతున్నాయి. ఆడతోడు కోసం సంచరించే పులులు ఎలాంటి హానీ చేయవు. పులులు కనిపిస్తే ఎటూ కదలకుండా నిలబడిపోవడం మంచిది.