కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : సంపద పెంచు… అన్ని వర్గాలకు పంచు అనే విధానంతో ముందుకెళ్తున్న రాష్ట్ర సర్కారు.. అనేక పథకాలు అమలు చేస్తూ ఇంటింటికీ చేరవేస్తున్నది. ప్రధానంగా మహిళా సంక్షేమం కోసం అత్యంత ప్రాధాన్యమిస్తున్నది. గర్భం దాల్చినప్పటి నుంచి వృద్ధాప్యం వరకు వివిధ రూపాల్లో పథకాలు తీసుకొచ్చి అండగా నిలుస్తున్నది.
కేసీఆర్ కిట్‌తో సాయం..
గిరిజన ప్రాంతమైన ఆసిఫాబాద్ జిల్లాలో ఆరోగ్యపరమైన అవగాహన చాలా తక్కువ. ఈ నేపథ్యంలో మహిళలు ఎక్కువగా రక్తహీనతకు గురవుతుంటారు. ప్రసవ సమయంలో గర్భిణులకు 12 శాతం ఉండాల్సిన హిమోగ్లోబిన్ శాతం 5 నుంచి 6 శాతం మాత్రమే ఉంటోంది. దీంతో సాధారణ ప్రసవాలు జరగడం కష్టంగా ఉంది. గర్భిణులకు సరైన పౌష్టికాహారం దొరకక ఈ సమస్యలు తలెత్తేవి. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కేసీఆర్ కిట్‌ను తీసుకువచ్చింది. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలోని ప్రతి గర్భిణికి పౌష్టికాహారం అందించాలనే సంకల్పంతో కేసీఆర్ కిట్ల ద్వారా మూడో నెల నుంచి ప్రసవం వరకు మూడుసార్లు అందిస్తోంది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు జరుపుకున్నవారికి ఉచితంగా వైద్య సేవలు అందించడంతో పాటు 13 రకాల వస్తువులతో కేసీఆర్ కిట్‌ను అందజేస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలో ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 50,219 మందికి అందించారు. పుట్టిన పిల్లలకు ప్రోత్సాహకంగా నగదను అందజేస్తున్నారు. ఆడపిల్ల పుడితే రూ. 13 వేలు, మగపిల్లవాడు పుడితే రూ.12 వేలు ఇస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లోని గర్భిణులు ఆసుపత్రుల్లో ప్రసవాలు పొందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పొందిన 54,084 మంది బాలింతలకు రూ.19 కోట్ల 79 లక్షల 13 వేలు అందించింది.
ప్రత్యేకంగా అంబులెన్స్‌లు..
జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో 108, 102.. అం బులెన్స్‌లు ఉత్తమ సేవలు అందిస్తున్నాయి. వైద్యపరీక్షలు, ప్రసవాల కోసం సమాచారం అందించిన నిమిషాల్లోనే ద వాఖానలకు చేరవేస్తున్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో మాతా.. శిశు మరణాలను తగ్గించడంలో అంబులెన్స్‌ల సేవలు ప్రత్యేకమైనవి. 108 అంబులెన్స్‌ల సిబ్బంది గర్భిణులను డెలివరీ కోసం సకాలంలో ఆసుపత్రికి చేర్చడంలోనే కాదు అత్యవసరమైతే అంబుల్సెలోనే ప్రసవాలు కూడా చేస్తున్నారు. తల్లీ బిడ్డలను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుతున్నారు. దాదాపు 6 వేల మంది గర్భిణులకు అత్యవసర సమయాల్లో వైద్యసేవలు అందించాయి. ఇక గర్భం దాల్చినప్పటి నుంచి ఆసుత్రులకు తీసుకెళ్లడం, వైద్య పరీక్షల అనంతరం తిరిగి ఇంటికి చేర్చడంలో 102 అంబులెన్స్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
‘ఆరోగ్య లక్ష్మి’తో పౌష్టికాహారం
ప్రభుత్వం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తోంది. బియ్యం, కందిపప్పు, నూనె, పాలు, ఉడికించిన గుడ్లను అందిస్తూ గర్భిణులు, పిల్లల ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. జిల్లాలో సుమారు 9,700 మందికి లబ్ధి చేకూర్చింది.
ఆడబిడ్డకు సర్కారు కట్నం …
పేదింటి కుటుంబాలు ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలంటే ఆర్థికంగా సతమతమయ్యేవి. ఖర్చులు భరించలేక అప్పు ల పాలయ్యేవి. చివరగా ఆడపిల్ల అంటేన భారమనే అభిప్రాయం వ్యక్తమయ్యేది. ఈ పరిస్థితి గమనించిన రాష్ట్ర సర్కారు పేద ఆడపిల్ల పెళ్లికి పెద్దన్నలా మారింది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టి, బడుగు తల్లిదండ్రులకు కొండంత అండగా నిలుస్తున్నది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంలో భాగంగా ఒక్కొక్కరి పెళ్లికి రూ. 100116 చొప్పున అందిస్తున్నది. జిల్లాలో 21,412 మందికి రూ. 195 కోట్ల 92 లక్షలు అందించింది.
ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు పింఛన్లు
వృద్ధులకు, వితంతువులకు పింఛన్లు ఇవ్వడం సాధారణమే.. ప్రత్యేకంగా ఒంటరి మహిళలు, బీడీ కార్మికులను ప్రత్యేకంగా గుర్తించి వారికి పింఛన్లు ఇవ్వడం విశేషం. జిల్లాలో 86 మంది బీడీ కార్మికులు, 2,641 మంది ఒంటరి మహిళలు, 22,312 మందికి వితంతు పింఛన్లు అందిస్తూ అండగా నిలుస్తున్నది రాష్ట్ర సర్కారు.