రెబ్బెన, మార్చి 2 : సాధారణంగా వరి నాటు వేసిన తర్వాత మూడు నెలలకు పొట్ట దశకు వస్తుంది. కానీ.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నక్కలగూడకు చెందిన రైతు కిరణ్ వేసిన పొలం 45 రోజులకే పొట్టకు రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. రైతు కిరణ్ వివిధ రకాల కంపెనీలకు చెందిన 27 విత్తన సంచులను కొనుగోలు చేసి పంట వేశాడు. ఇందులోని 7 సంచుల విత్తనాల్లోనే తేడా వచ్చినట్లు కిరణ్ అభిప్రాయ పడుతున్నాడు. సుమారు మూడు ఎకరాల్లో వేసిన పొలం.. 45 రోజులకే పొట్టదశకు వచ్చినట్లు తెలుస్తున్నది.
ఈ ప్రాంత రైతులు పెద్దపల్లి జిల్లా నుంచి కూడా విత్తనాలు తీసుకొచ్చి నాట్లు వేశారు. అయితే, ఏ కంపెనీ విత్తనాల వల్ల ఇలా జరిగిందో స్పష్టంగా తెలియడం లేదు. ఓ డీలర్ ఈ ఏరియా రైతులకు వివిధ కంపెనీలకు చెందిన సుమారు 3 టన్నుల విత్తనాలు విక్రయించినట్లు తెలుస్తున్నది. రైతు కిరణ్ విత్తనాలు సరఫరా చేసిన వ్యక్తితో పాటు అధికారులకు సమాచారం అందించాడు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే దీనిపై స్పష్టత రానున్నది.