“ఎక్కడ మేడం.. మన పార్టీ నాయకుడు మీతో మాట్లాడిన కాల్ రికార్డింగ్ ఎలా బయటికి వచ్చింది. మీరు ఎవ్వరికి పంపారు. అది ఎక్కడెక్కడో తిరిగి నాదాకా వచ్చింది. పీఏలకు ఇచ్చేది ఉందని వాళ్లు చెప్తే అది నిజం అయిపోతుందా? మీరు ఎందుకు ఆ రికార్డు బయటికి ఇచ్చారు.’
మంచిర్యాల, నవంబర్ 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : “మూడు లక్షల రూపాయలు ఇస్తే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిదాం.. మనోళ్లు ఎవ్వరైనా డబ్బులు ఇచ్చే వాళ్లుంటే చెప్పండి. జాబితాలో పేరు వచ్చాకే డబ్బులు ఇవ్వమను. నీ వార్డులో ఇద్దరిని చూడు. నీతో కాకపోతే వేరే వాళ్లకు అప్పగిస్తాం. ఏఐసీసీ లింక్ దొరికింది డీసీసీ కూడా మన ప్రభాకరన్నకు ఖాయమైనట్టే.. డబుల్ బెడ్రూంలకు ఇచ్చే రూ.3 లక్షలు నాకు ఒక్కడికే కాదు. కాంగ్రెస్ నేతలు, పీఏలకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది..” అని నవంబర్ 7వ తేదీ రాత్రి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బజార్ ఏరియాకు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు.. కాల్టెక్స్ ఏరియాకు చెందిన ఓ మహిళ నాయకురాలితో ఫోన్లో మాట్లాడిన సంభాషణల ఆడియో సోషల్ మీడియాలో వైరలైంది.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఆడియో వ్యవహారంలో ఫోన్లో మాట్లాడిన సదరు కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలితో బెల్లంపల్లి ఎమ్మెల్యే పీఏ తాజాగా మాట్లాడిన ఫోన్ సంభాషణలు బయటికి వచ్చాయి. ఈ నెల 8వ తేదీ నుంచి పలుమార్లు సదరు నాయకురాలికి ఫోన్ చేసిన పీఏ “ఎక్కడ మేడం.. మన పార్టీ నాయకుడు మీతో మాట్లాడిన కాల్ రికార్డింగ్ ఎలా బయటికి వచ్చింది. మీరు ఎవ్వరికి పంపారు. అది ఎక్కడెక్కడో తిరిగి నాదాకా వచ్చింది. పీఏలకు ఇచ్చేది ఉందని వాళ్లు చెప్తే అది నిజం అయిపోతుందా? మీరు ఎందుకు ఆ రికార్డు బయటికి ఇచ్చారు.’ అంటూ మాట్లాడుతూనే నేను ఇప్పుడు సీఎం గారి బర్త్‌డేకు వెళ్తున్నా.. నువ్వు జాగ్రత్తగా ఉండాలి.. అంటూ హెచ్చరిక చెప్పాడు.
దానికి సదరు నాయకురాలు జాగ్రత్తగా ఉండడం అంటే ఏంటీ అంటూ ప్రశ్నించారు. దానికి పీఏ ఏమైనా ఉంటే ఇట్ల అనవసరంగా స్ప్రెడ్ చేసుకోవద్దని చెప్తున్నా అంతే.. నీకు నిజంగా ఏమైనా సమస్య ఉంటే డైరెక్టుగా ఎమ్మెల్యే సార్తోని మాట్లాడు.. సార్ కూడా నీకు డైరెక్ట్ చెప్తరు కదా. నీకు సార్ తెల్వదా.. సార్ దగ్గరకు నిన్ను తీసుకొని వెళ్లాలా? మధ్యలో నీకు ఎవ్వరన్న అవసరమా? సార్ నిన్ను గుర్తుపట్టడా.. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు రికార్డింగ్ బయటికి వెళ్లే మీరే కదా ఇబ్బంది పడేది..” అంటూ మాట్లాడారు. ఈ సమయంలో సదరు మహిళ నాయకురాలు పీఏను నిలదీసింది. డబుల్ బెడ్రూం ఇండ్లకు డబ్బులు వసూలు చేసేంత స్వేచ్ఛ మీరు ఆ నాయకులకు ఎందుకు ఇచ్చారు అంటూ ప్రశ్నించింది.
మీరు ఇంత ఎంకరేజ్ చేయకపోతే వాళ్లకు అంత బలం ఎక్కడి నుంచి వస్తుంది. సార్ క్లోజ్, పీఏలు క్లోజ్.. పీఏలకే డబ్బులు కావాలని ఆ నాయకుడు అంత బహిరంగంగా ఎలా చెప్తాడు. పార్టీ కోసం కష్టపడిన నన్ను, నా భర్తను ఎందుకు తొక్కేస్తూ, వేరే వాళ్లను ఎందుకు అంత లేపుతున్నారు. ఎమ్మెల్యే సార్‌కు మీరు ఇచ్చే ఫీడ్ బ్యాక్ కారణంగానే కదా.. కష్టపడిన వారిని గుర్తింపు రావడం లేదంటూ ప్రశ్నించింది. దానికి పీఏను నేను తర్వాత మాట్లాడుతాను అంటూ చెప్పి ఫోన్ కట్ చేశాడు. మరోసారి ఫోన్ చేసి నేను నీకు ఫోన్ చేసిన విషయం వేరే వాళ్లకు ఎలా తెలిసింది అని పీఏ అడిగాడు. దానికి ఆమె నాకు తెలియదు అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే బుధవారం పోలీసులు సదరు మహిళ నాయకురాలుకు ఫోన్ చేసి మీరు సాయంత్రం 5.30 గంటలకు ఏసీపీ ఆఫీస్‌కు రావాలంటూ పిలిచారు. అనంతరం మరోసారి ఫోన్ చేసి ఏసీపీ ఆఫీస్‌కు వద్దు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ రావాలని పిలిపించారు. ఇదే విషయంపై పోలీసులు ఆరా తీసినట్లు తెలిసింది.
ఈ విషయంలో పోలీసులు సదరు నాయకురాలిని స్టేషన్‌కు పిలిపించాల్సిన అవసరం ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అక్కడ కూడా సదరు నాయకురాలు తగ్గకపోవడం, డబుల్ బెడ్రూం ఇండ్లకు డబ్బులు అడిగిన వారిని పిలవకుండా నన్ను ఎందుకు పిలిచారంటూ అడిగినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో పీఏ, పోలీసులు నాయకురాలితో మాట్లాడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సదరు నాయకురాలిని బెదిరించడం కోసమే ఇలా చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో ఏమైనా మాట్లాడంటే ఎమ్మెల్యే లేదా పార్టీ మండల ఇన్చార్జిలు మాట్లాడాలి. పీఏ జోక్యం ఏంటీ? పోలీస్ స్టేషన్‌కు పిలవాల్సినంత తప్పు ఆమె ఏం చేసింది అన్నది అర్థం కావడం లేదు. గతంలో ఒకటో వార్డు మాజీ కౌన్సిలర్తోనూ ఇలాగే గొడవపెట్టుకొని, చివరకు సదరు కౌన్సిలర్‌పై కొట్టారని.. ఇప్పుడే అదే తరహాలో మహిళ నాయకురాలిపై కుట్రలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఎమ్మెల్యే వినోద్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, పార్టీ ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకులే కోరుతున్నారు.