ఎదులాపురం, మే 30 : జల్సాలకు అలవాటు పడిన నలుగురు యువకులు గల దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ గౌష్ ఆలం వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలోని వడ్డెరకాలనీకి చెందిన మీర్జ ముషారఫ్బేగ్ అలియస్ చోటా ముషారఫ్, ము స్సు.. షేక్ బిలాల్ అలియస్ బిలాల్ అహ్మద్, జైనథ్ మండలంలోని రామయి గ్రామానికి చెందిన గజ్బే అక్షయ్, మెస్రం దత్తు అనే యువకులు జల్సాలకు అలవాటు పడి దొంగ ల ముఠాగా ఏర్పడ్డారు. నేరాలు చేస్తూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడం, గంజాయి వంటి మాదకద్రవ్యాలను సేవించడం అలవాటుగా చేసుకున్నారు. డబ్బుల కోసం హత్య డలు, దోపిడీలు, ద్విచక్రవాహనాలను దొంగిలించడం, ఇండ్లలో దొంగతనాలకు కూడా అలవాటు పడ్డారు. ఈ క్రమంలో ఈనెల 25వ తేదీన ఆదిలాబాద్ పట్టణం ఒక అమాయకుడి వద్ద డబ్బులు ఉన్నాయని గ్రహించారు. దోచుకుందామనే ఉద్దేశంతో ఆటోడ్రైవర్ మెస్రం దత్తు, ముషారఫ్, షేక్ బిలాల్‌లు బేల మండలానికి చెందిన మెస్రం కైలాస్‌ను నడిరోడ్డుపై ఆపి నీవు మా డబ్బులు దొంగిలించావంటూ అక్షయ్ సహాయంతో బలవంతంగా ఆటోలో కూర్చొబెట్టే ప్రయత్నం చేశారు. రాక పోయేసరికి బలవంతంగా కొట్టి అతని వద్ద ఉన్న రూ.10 వేలను బలవంతంగా లాక్కొని పారిపోయారు. బాధితుడు కైలాస్ టూ టౌన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ కెమెరాల ఆధారంగా నేరస్తులను పట్టుకున్నారు.
ఈనెల 13వ తేదీన కూడా ఇదే తరహాలో రైల్వే స్టేషన్లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కారులో వచ్చి బలవంతంగా మహారాష్ట్రకు తీసుకెళ్లారు. అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్, డబ్బులను తీసుకున్నారు. ఉండం గ్రామ శివారులోకి రాగానే మూత్ర విసర్జనకు కారు ఆపినపుడు బాధితుడు పారిపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇలా దొంగతనాలకు పాల్పడుతూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేసుకోవడం ప్రారంభించారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో మీర్జ ముషారఫ్ బేగ్‌పై 20 కేసులు ఉన్నాయి. ఈ సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐలు అశోక్, సత్యనారాయణ, ఐటీ కోర్ సిబ్బంది సంజీవ్ కుమార్, రియాజ్, క్రైమ్ పార్టీ సిబ్బంది రమేశ్, నరేశ్, క్రాంతి, నరేందర్, సుధాకర్‌రెడ్డిలు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ పట్టణంలో గురువారం అరెస్టు చేసిన దొంగల ముఠా వద్ద ఒక కారు, ఆటో, సెల్‌ఫోన్, రూ.4 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.