కోటపల్లి, మే 11 : కోటపల్లి ఎస్ఐ రాజేందర్ కృషి ఫలితంగా స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహం విద్యార్థులు పది పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. విధి నిర్వహణలో తీరిక లేకుండా ఉండే ఉద్యోగం చేస్తూనే.. ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు పాఠాలు బోధించి, ఉత్తమ ఫలితాలు రాబట్టారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన, ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో చదువుకొనే ఉద్యోగం సాధించారు. చదువుతోనే ప్రగతి సాధ్యమని, కష్టపడితే సాధించలేదని లేదని నమ్మి పేద విద్యార్థులు చదువు వైపు దృష్టిపెట్టేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో ప్రతి రోజూ సాయంత్రం ఈ వసతి గృహాన్ని సందర్శిస్తూ విద్యార్థులను చదువువైపు ప్రోత్సహించారు. సాయంత్రం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. వారికి స్నాక్స్‌తో పాటు, అవసరమైన స్డడీ మెటీరియల్ అందిస్తూ వెన్నుతట్టారు. పరీక్షలపై భయాన్ని తొలగించడంతో పాటు, ఉత్సహంగా పరీక్షలు రాసేందుకు తన అనుభవాలను చెప్తుండేవారు. ఏ విషయంలో సందేహాలున్నా తన అనుభవంతో పరిష్కరిస్తూ వారిలో ఉత్సాహం నింపిన ఈ ఎస్ఐ.. విద్యార్థుల పాలిట ‘సార్..’ అయ్యారు. ఇక్కడ చదివిన 23 మందికి 23 మంది విద్యార్థులు ఉత్తీర్ణులవగా, సార్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
కోటపల్లి ఎస్ఐ సార్ కృషి వల్లే 100 శాతం ఉత్తీర్ణత సాధించాం. కోటపల్లి మోడల్ స్కూల్లో విద్యాబోధన అనంతరం హాస్టల్‌కు వచ్చిన తర్వాత చదవకుండా కాలక్షేపం చేసేవాళ్లం. కానీ మా హాస్టల్‌పై సార్ ప్రత్యేక దృష్టి పెట్టి, రోజూ సాయంత్రం సందర్శించేవారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పాఠాలు బోధించడం వల్ల సక్సెస్ అయ్యాం. పట్టుబట్టి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని ఆయనను చూసే నేర్చుకున్నాం. సూచనలు, సలహాలతో ఉన్నతంగా చదివి మంచి కొలువులు సాధిస్తాం.
పదో తరగతి విద్యార్థులపై కోటపల్లి ఎస్ఐ రాజేందర్ ప్రత్యేక దృష్టిపెట్టారు. అందువల్లే వారు మంచి ఫలితాలు సాధించాం. ప్రతిరోజూ మా వసతి గృహాన్ని ఎస్ఐ స్థాయి అధికారి సందర్శించడం వల్ల విద్యార్థులు చదువుపై దృష్టిపెట్టారు. విద్యార్థులు చెడువైపు పయణించకుండా ఆయన చేసిన కృషి అభినందనీయం. ఇలా ప్రతీ వసతి గృహాన్ని మండలస్థాయి అధికారులు దత్తత తీసుకుంటే విద్యార్థుల్లో ఆత్మైస్థెర్యం పెరుగుతుంది. దీంతో పాటు, మంచి ఫలితాలు కూడా సాధించవచ్చు.
విద్యార్థి దశలో ముఖ్యమైన దశ పదోతరగతి. ఈ దశలో విద్యార్థులు సన్మార్గంలో నడిస్తేనే ప్రయోజకులవుతారు. విద్యతోనే ప్రగతి సాధ్యం. వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెడితే అద్భుతాలు సాధించవచ్చు. నేనూ వసతి గృహంలో ఉంటూనే చదవుకొని ఈ స్థాయిలో ఉన్నా. కోటపల్లి ఎస్సీ బాలుర వసతి గృహంపై ప్రత్యేక దృష్టి పెట్టా. మా ఉన్నతాధికారుల సూచనలు, సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుతూ విద్యార్థులను పది పరీక్షలకు సన్నద్ధం చేసి విజయం సాధించా.