మంచిర్యాల, నవంబర్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చెన్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన పోటీ నెలకున్నది. ఆ పార్టీ నాయకులు ఎవరికీ వారే చైర్మన్ పదవి దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే వివేక్‌పై ఆ నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు గెలిచిన వెంటనే తన పరిధిలోని మార్కెట్ కమిటీలను నియమించారు. చెన్నూర్ మార్కెట్ కమిటీ విషయంలో మాత్రం స్థానిక ఎమ్మెల్యే ముందు నుంచి దాటవేసే ధోరణి అవలంబిస్తున్నారు. ముందు ఎంపీ ఎన్నికలు అయ్యాక చూద్దామని చెప్పిన ఆయన ఇప్పుడు మంత్రి పదవిపై క్లారిటీ వచ్చాక చూద్దామంటూ నాయకులకు చెప్తున్నట్లు తెలిసింది. దీంతో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి, కొడుకును ఎంపీగా గెలిపించుకుని పదవులు అనుభవిస్తున్నాడని, మాకు పదవి ఇచ్చేందుకు మాత్రం ఆయనకు మనసు రావడం లేదంటూ కాంగ్రెస్ నాయకులే మండిపడుతున్నారు. ఒకవేళ మంత్రి పదవి వేరే వాళ్లకు వస్తే చెన్నూర్ మార్కెట్ కమిటీకి చైర్మన్‌నే నియమించరా? అని ప్రశ్నిస్తున్నారు.
పదవి కోసం పట్టు
చెన్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఇస్తే చెన్నూర్ లేదా కోటపల్లి మండలాలకు చెందిన నాయకులే ఇస్తారు తప్పితే.. వేరే మండలాల వారికి ఇవ్వరనే చర్చ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నది. షాడో ఎమ్మెల్యేగా చెప్పుకునే కోటపల్లికి చెందిన ఓ లీడర్ ఆయన అనుచరుల్లో ఒకరికి చైర్మన్ పదవి ఇవ్వాలంటూ ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. మా సామాజిక వర్గం లేకపోతే నియోజకవర్గంలో పార్టీకి ఇబ్బందులు తప్పవని.. మా వాళ్లకే పదవి ఇవ్వాలంటూ ఆయన పట్టుపడుతున్నట్లు సమాచారం. ఈసారి బీసీలకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని రిజర్వ్ చేయడంతో తన ఇంట్లో పని చేసే ఓ వ్యక్తికి ఈ పదవి ఇవ్వాలంటే సదరు నేత ప్రయత్నిస్తున్నారట. షాడో ఎమ్మెల్యే చేతిలో కీలుబొమ్మగా మారిన ఎమ్మెల్యే వివేక్ ఆయన చెప్పిన వ్యక్తికే చైర్మన్ పదవి ఇస్తారేమో అని పదవి ఆశించే మిగిలిన నాయకులు భావిస్తున్నారు.
ఇక చెన్నూర్ మండలంలోని కిష్టంపేట గ్రామానికి చెందిన ఓ బీసీ లీడర్‌కు ఎమ్మెల్యే వివేక్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇస్తానని మాట ఇచ్చారనే చర్చ నడుస్తున్నది. వీరితోపాటు ఎప్పటి నుంచో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి పోటీ పడుతున్న భీమారం మండలానికి చెందిన ఓ బీసీ లీడర్ పేరు వినిపిస్తుంది. ఎప్పటిలాగే చెన్నూర్, కోటపల్లి వాళ్లకు కాకుండా ఈసారి పాత జైపూర్ మండలానికి చెందిన తనకు అవకాశం ఇవ్వాలని ఆయన పట్టుపడుతున్నారు. పార్టీ కోసం కష్టపడ్డానని, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పైసా ఆశించకుండా పనిచేశానని, చైర్మన్ పదవి తనకే ఇవ్వాలని ఆ లీడర్ ఈ మధ్య ఓ వీడియోను విడుదల చేశారు.
ఎమ్మెల్యే కొడుకును ఎంపీ చేసుకున్నట్లే మా లాంటి యువకులు, చదువుకున్న వారికి చైర్మన్ పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే బీసీ సంఘాల నాయకులు, సర్పంచ్ సంఘం నాయకులు ఆయనకే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి పత్రాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చైర్మన్ పదవి రేసులో ఆయన అందరి కంటే ముందున్నారనే చర్చ ఇప్పుడు చెన్నూర్‌లో నడుస్తున్నది. మార్పు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి విషయంలోనూ అదే అవలంబించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యేకు తలనొప్పిగా వ్యవహారం
ఇలా ఎవరికి వారు పైరవీలతో వస్తుండడంతో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎమ్మెల్యే వివేక్‌కు తలనొప్పిగా మారింది. ఒకవేళ షాడో ఎమ్మెల్యే చెప్పిన వ్యక్తికి లేదా కిష్టంపేట లీడర్‌కు ఇద్దరిలో ఎవరికి ఇచ్చిన జైపూర్ మండలం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. జైపూర్ మండలానికి చెందిన లీడర్‌కు ఇస్తే షాడో ఎమ్మెల్యే ఎలా రియాక్ట్ అవుతారోనని ఎమ్మెల్యే వెనకడువేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒకరికి పదవి ఇచ్చి మరొకరి ఇవ్వకపోతే పార్టీకి ఇబ్బంది అని ఎమ్మెల్యే భావిస్తున్నట్లు సమాచారం. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న ఈ వ్యవహారం ఇప్పుడు ముదిరి పాకాన పడింది. ఎవరికిచ్చినా పర్లేదు కానీ యువకులు, చదువుకున్న వారికి పదవి ఇవ్వాలనే డిమాండ్ ఓ వర్గం నుంచి వినిపిస్తున్నది.
ఎమ్మెల్యే తన కొడుకును ఎంపీగా గెలిపించుకోవడానికి ముందు నియోజకవర్గంలో యువ నాయకత్వానికి అవకాశాలిస్తామని ప్రకటించారు. ఆ మేరకు యువకులకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వాలనే చర్చ జోరుగా నడుస్తున్నది. ఎప్పటిలాగే మార్కెట్ కమిటీ పదవిని చెన్నూర్, కోటపల్లికే పరిమితం చేయకుండా పాత జైపూర్ మండలానికి ఇవ్వాలని ఇక్కడి నాయకులు అంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఎవరికి అవకాశం ఇస్తారన్నది ఆసక్తిగా మారింది. షాడో ఎమ్మెల్యే చెప్పిన వారికి ఇచ్చి తాను కీలుబొమ్మ ఎమ్మెల్యే అనే వాదనకు బలం చేకూరుస్తారా.. లేక ప్రజాభీష్టం, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను పరిగణిలోకి తీసుకుని మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై నిర్ణయం తీసుకుంటారా అన్నది వేచి చూడాల్సి ఉంది.