ఆదిలాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేటు వైద్యశాలల విషయంలో వైద్యఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణ లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఆదిలాబాద్ జిల్ల్లా కేంద్రంతోపాటు ఇతర ప్రాంతాల్లో 60కి పైగా ప్రైవేటు వైద్యశాలలున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వైద్యం కోసం జిల్లా కేంద్రానికి వస్తుంటారు. జనరల్ వ్యాధులు, గర్భిణులు, చిన్న పిల్లలు, ప్రసూతికి సంబంధించి ప్రజలు ఎక్కువగా వైద్యశాలలకు వస్తుంటారు.
ప్రజల అవసరాలను అవకాశంగా తీసుకొని కొన్ని వైద్యశాలల నిర్వాహకులు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొందరు ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహించడమే కాకుండా అవసరం లేకుండా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించడం, మందులు ఇస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఆసుపత్రుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, మెడికల్ షాపులు పెట్టుకొని అధిక ధరలకు మందులు విక్రయిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ఆరు నెలల కిందట కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్యశాఖ అధికారులుపలు ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేశారు.
ఇటీవల బస్టాండ్ ఎదుట గల ప్రైవేటు వైద్యశాలలో చిన్నారి మృతి చెందగా.. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా చనిపోయిందంటూ బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని వైద్యశాఖ అధికారులు ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నా నిబంధనలు పాటించని వాటిపై నామమాత్రంగా చర్యలు తీసుకుంటారనే విమర్శలు వస్తున్నాయి. పలు దవఖానాల్లో వైద్య నిఫుణుల వివరాలు వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం లో నమోదు చేసుకోవడం లేదు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ నిషేధిత చట్టం ప్రకారం హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం, వాహనాల పార్కింగ్ సదుపాయం లేకపోవడం వంటి లోపాలు అధికారుల తనిఖీల్లో వెలుగు చూశాయి.
దీంతోపాటు మెడికల్ షాపుల్లో షెడ్యూల్ ఎక్స్ అమ్మకాలకు లైసెన్స్లు తీసుకోకపోవడం, ఫార్మసిస్ట్ లేకపోవడం, హెచ్1 రిజిస్టర్ నిర్వహణ, మందు విక్రయాల రసీదులు లేకపోవడం వంటివి వైద్యశాఖ అధికారులు గతంలో నిర్వహించిన తనిఖీల్లో గుర్తించారు. నిబంధనలు పాటించని ప్రైవేటు వైద్యశాలలకు లోపాలు సరిదిద్దుకోవాటంలూ నోటీసులు జారీ చేస్తున్నారు. కొన్నింటికి జరిమానాలు విధిస్తున్నారు. నిబంధనలు పాటించనని వైద్యశాలలతోపాటు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేసిన వైద్యశాలలను మూసివేయాలని, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.