ఆదిలాబాద్, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ) ః ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతోపాటు అన్ని ప్రభుత్వ శాఖలు ఒకేచోట ఉండేలా, సకల సౌకర్యాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని మంజూరు చేసింది. జిల్లాలో రూ.55 కోట్లతో సర్వే నంబరు 72 /1 /6లో 19 ఎకరాల్లో న్యూ హౌసింగ్ బోర్డు ప్రాంతంలో కొత్త కలెక్టరేట్ నిర్మాణాన్ని చేపట్టింది. 17 ఎకరాల స్థలం కేటాయించగా నాలుగెకరాల్లో భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అధికారులు రూపొందించిన ప్లాన్ ప్రకారం 1.20 లక్షల స్కేర్ ఫీట్లతో జీ ప్లస్ 2 అంతస్తులతో వివిధ కార్యాలయాల సముదాయాలను నిర్మించాలి. 2023 జూన్లో ప్రారంభమైన పనులు ఈ ఏడాది పూర్తి కావాల్సి ఉండగా అర్ధాంతరంగా నిలిచి పోయాయి.
గతేడాది కురిసిన భారీ వర్షాల కారణంగా సెప్టెంబర్ 11న కలెక్టరేట్ భవనం కూలింది. దీంతో అధికారులు భవన నిర్మాణ పనులను వేగవంతం చేశారు. భవనం కూలిపోవడంతో అడిషనల్ కలెక్టర్ కార్యాలయంతోపాటు ఆర్డీవో, పౌర సరఫరాల శాఖ, ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం, కలెక్టరేట్లోని వివిధ విభాగాలను ఇతర భవనాల్లోకి మార్చారు. భవనం నిర్మాణాన్ని తొందరగా పూర్తి చేసి అందులోని అన్ని విభాగాలను తరలించవచ్చనే ఆలోచన చేశారు. ఈ ఏడాది జూన్ 30వ తేదీలోగా పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు కేవలం 30 శాతం పనులు పూర్తి కాగా నిర్ణీత గడువులోగా భవనం అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దాదాపు 42 ప్రభుత్వ శాఖలు ఒకే చోట ఉండేలా నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవనం పనులు రెండు నెలలుగా నత్తనడకన సాగుతున్నాయి. భవన నిర్మాణ పనులను తొందరగా పూర్తి చేసి తమ పనుల కోసం వచ్చే వారికి అన్ని శాఖలు ఒకే చోట ఉండలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.