ఎదులాపురం, జనవరి 6 : ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని 37 మోడల్ స్కూళ్లలో చేపట్టిన పనులను ఈ నెల 15వ తేదీలోగా పూర్తిచేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ఇంజినీరింగ్, విద్య, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో ‘మన ఊరు – మన బడి’ పనులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. ఉపాధి హామీ కింద పాఠశాలలో చేపట్టే మరుగుదొడ్లు, కిచన్ షెడ్డు, ప్రహరీ పనులు కూడా పూర్తిచేయాలన్నారు. పనులకు సంబంధించిన వివరాల రికార్డులను అప్లోడ్ చేయాలని సూచించారు. అలాగే రూ.30లక్షల లోపు పనులను పూర్తిగా గ్రౌండింగ్ చేయాలన్నారు పాఠశాలల్లో పెయిటింగ్, క్లీనింగ్, వంట పనులు చేపట్టాలని తెలిపారు.
ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రపర్యటనను నిర్వహించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. అనంతరం అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. ‘మన ఊరు-మన బడి’ పనులను సకాలంలో పూర్తిచేసి, నివేదికలను యాప్లో పొందుపర్చాలన్నారు. అలాగే బిల్లులను చెల్లించేందుకు రికార్డులను అప్లోడ్ చేయాలని తెలిపారు. 37 మోడల్ పాఠశాలల పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. ఈ సమావేశంలో డీఈవో టీ ప్రణీత, డీఆర్డీవో కిషన్, ఏడీఆర్డీవో రవీందర్ రాథోడ్, పీఆర్, ఆర్అండ్బీ, గిరిజన సాంఘిక సంక్షేమ, మున్సిపల్ శాఖల ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.