కుభీర్ : బస్సు ఎక్కే తొందరలో పర్సును మరిచిపోయి ఇంటికి వెళ్లిన బాధితురాలికి తిరిగి వాటిని అప్పగించిన వైనం నిర్మల్ ( Nirmal ) జిల్లాలో చోటుచేసుకుంది. కుభీర్( Kubeer ) మండలం కుప్టి గ్రామానికి చెందిన బోయిడి తిరుమల అనే మహిళ కుభీర్‌లో భైంసా బస్సు( Bus ) ఎక్కే తొందరలో తన చేతిలో ఉన్న మినీ బ్యాగును కూర్చున్న చోటే మర్చిపోయింది.
భైంసాకు వెళ్లిన అనంతరం తన బ్యాగు లేదని గమనించింది. చేసేది ఏమీ లేక తన ఇంటికి ఆమె వెళ్లిపోయింది. పర్సులో రూ. 22,416, పట్ట గొలుసులు, వివిధ కార్డులు కలిగిన ఆ బ్యాగు కుభీర్‌కు చెందిన దొంతుల దత్తాత్రి కి దొరికింది. ఆయన వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి దొరికిన బ్యాగును ఎస్సై కృష్ణారెడ్డికి అప్పగించారు. అందులో ఉన్న కార్డుల ఆదారంగా మహిళను గుర్తించి సమాచారం అందించి పోలీస్ స్టేషన్ కు పిలిపించారు.
నిర్మల్ అడిషనల్ ఎస్పీ ఉపేంద్ర రెడ్డి, కుభీర్ ఎస్సై కృష్ణారెడ్డి బాధితురాలి నుంచి పూర్తి వివరాలు సేకరించి డబ్బులు పట్ట గొలుసులతో కూడిన బ్యాగును మహిళకు అప్పగించారు. ఈ సందర్భంగా నిజాయితీని చాటుకున్న దత్తాత్రిని సన్మానించి అభినందించారు.