లక్ష్మణచాంద, నవంబర్ 7 : పీచర గ్రామానికి చెందిన గుర్రం బొర్రన్న, పొట్టపెల్లి(బి) గ్రామానికి చెందిన రామనవార్ హన్మండ్లు, పార్పెల్లి గ్రామానికి చెందిన జుంగాల అశోక్, పీచర గ్రామానికి చెందిన గుర్రం చిన్నయ్య భూములకు విద్యుత్ సరఫరా చేస్తున్న ట్రాన్స్ఫార్మర్ గత శుక్రవారం కాలిపోయింది. కాగా.. విద్యుత్ పీచర సబ్‌స్టేషన్‌లోని ధర్మారం ఫీడర్ ద్వారా పంపిణీ అవుతున్నది.
వారం రోజులుగా ట్రాన్స్ఫార్మర్ పనిచేయకపోవడంతో రైతులు విద్యుత్ శాఖ సిబ్బందిని సంప్రదించినా స్పందించలేదు. విద్యుత్ మరమ్మతు చేసే ఓ ప్రైవేటు వ్యక్తిని సంప్రదించగా ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినట్లు ధ్రువీకరించాడు. లైన్ ఇన్స్పెక్టర్ నారాయణ సింగ్, ఏఈ మహేశ్‌ను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో రైతులు ట్రాక్టర్లో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ను జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయానికి బుధవారం తీసుకెళ్లారు.
కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ స్థానంలో తిరిగి విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది మరో ట్రాన్స్ఫార్మర్ను ఇచ్చారు. రూ.2,500 ఖర్చుతో తీసుకొచ్చి బిగించగా అది కూడా కాలిపోయింది ఇచ్చారని, మా గోస పగోడికి కూడా రావొద్దని రైతులు మండిపడ్డారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆందోళన చెందుతున్నారు.
గత శుక్రవారం ట్రాన్స్ఫార్మర్ కాలిపో యింది. ఎన్నిసార్లు విద్యుత్‌శాఖ అధికారులను సంప్రదించినా ఫలితం లేదు. దీంతో రూ.2,500లు పెట్టి ధర్మారంలోని ఓ ప్రైవేటు వ్యక్తికి ఇచ్చి ట్రాన్స్ఫార్మర్ను తీయించినం. తిరిగి బిగించినం. నిర్మల్‌కు తరలించడానికి ట్రాక్టర్‌కు రూ.2,500, నిర్మల్‌లో ట్రాన్స్ఫార్మర్ ఇచ్చిన సిబ్బందికి రూ.500 ఇచ్చినం. ఇంత ఖర్చు చేసినా ఫలితం లేదు. వేసిన మక్క మొలుకలు ఎండిపోతున్నాయి. ఒక్క విద్యుత్ శాఖ ఏఈ మహేశ్, లైన్ ఇన్స్పెక్టర్ నారాయణ సింగ్ రావడం లేదు. ఏంచేయాలో తెలియడం లేదు.
– రామనవార్ హన్మండ్లు, పొట్టపెల్లి(బి), లక్ష్మణచాంద మండలం.
ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని రైతు లు తెలుపడంతో నిర్మల్‌కు తీసుకెళ్లమ ని చెప్పాను. రైతులు మరో ట్రాన్స్‌ఫా ర్మర్ తెచ్చుకున్నారు. అది కూడా పని చేయడం లేదన్నారు. అది ఎందుకు పనిచేయడం లేదో నాకు తెలియదు. విచారించి తెలుసుకుంటా.
– మహేశ్, విద్యుత్‌శాఖ ఏఈ, లక్ష్మణచాంద.