శ్రీరాంపూర్, సెప్టెంబర్ 29 : శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-5 గనిపై కార్మికుల రెస్ట్ హాల్లో శనివారం రాత్రి దొంగతనం జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కార్మికుల వ్యక్తిగత టూల్ బాక్స్‌లు(పెట్టలు) పగుల గొట్టి వాటిలోని రూ. 10 వేలతో పాటు దుస్తులు, బ్యాగులు, సెల్ఫోన్లు (రూ. 3 లక్షల విలువ) ఎత్తుకెళ్లారు.
ఆదివారం ఉదయం ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వీరభద్రయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీసైదా, పిట్ కార్యదర్శి ప్రసాద్‌రెడ్డి, నర్సింహారావు, కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్‌ఖాన్ రెస్ట్హాల్ను పరిశీలించారు. కార్మికులతో మాట్లాడి దొంగతనంలో పోగొట్టుకున్న వస్తువుల గురించి అడిగి తెలుసుకున్నారు.
టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు పెట్టం లక్షణ్, డిప్యూటీ ప్రధానకార్యదర్శి బండి రమేశ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పానగంటి సత్తయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేశ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి అన్వేష్‌రెడ్డి, గొర్ల సంతోష్, గని ఇన్చార్జి దుర్గం రవి, పాపిరెడ్డి, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు జే శంకర్రావు దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు.
నాయకులు మాట్లాడుతూ యాజమాన్యం కబ్బోర్డు(లాకర్స్)రూం ఏర్పాటు చేయకపోవడం వల్లే తరచూ దొంగతనాలు జరుగుతున్నాయన్నారు. వెంటనే పర్మినెంట్ టూల్‌రూం, లాకర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దొంగతనాలు జరుగుతున్నాయంటే ఎస్అండ్పీసీల వైఫల్యమేనని, ఇందుకు యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్మికులు మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్ శ్రీరాంపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.