బేల, ఫిబ్రవరి 20 : సేవాలాల్ మహారాజ్ బోధనలు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచాయని, ప్రతి ఒకరూ ఆయన చూపిన మార్గంలో నడుచుకోవాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. శుక్రవారం బేల మండలంలోని పిట్గావ్లోని ఆలయంలో జగదాంబ దేవి, సేవాలాల్ మహరాజ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జోగు రామన్న మాట్లాడుతూ..జగదంబా దేవి, సేవాలాల్ మహరాజ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒకరూ ఆధ్యాత్మిక మార్గాన్ని ఆచరిస్తే శాంతి స్థాపనతోపాటు మానసిక ప్రశాంతత నెలకొంటుందని తెలిపారు. సంస్కృతీ సంప్రదాయాలను భావి తరాలకు అందించాలన్నారు.
సేవాలాల్ మహరాజ్ బోధనలు ఐకమత్యాన్ని చాటి చెబుతూ సన్మార్గం, ఆధ్యాత్మికతను నలుదికుల చాటాయని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒకరూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయనను గ్రామస్తులు శాలువాతో ఘనంగా సతరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రావుత్ మనోహర్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, నాయకులు మసే తేజరావు, ప్రకాశ్ పవర్ పాల్గొన్నారు.