కాసిపేట, ఆగస్టు 4 : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు న్యాయమైన ముగింపునిచ్చిందని, ఈ తీర్పు న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంచిందని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి కల్వల శరత్ మాదిగ పేర్కొన్నారు. ఆదివారం సోమగూడెంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఆయన మాట్లాడుతూ 30 ఏండ్ల కల నెరవేరుతున్నదన్నారు. మందకృష్ణ నాయకత్వంలో మాదిగ జాతి అలుపెరగని పోరాటం చేసిందని, దీనికి సమాజంలోని అన్ని విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాల మద్దతు లభించిందన్నారు. నాయకులు దాసరి రాంచేందర్, కొండ్రా తిరుపతి, ఉప్పులేటి శ్రీనివాస్, కుక రాంచేందర్, లంక లక్ష్మణ్, చిలుముల పోశం, బూడిది రమేశ్, వేమూర్ల వెంకటేశ్, కిషన్, తదితరులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్‌లో ర్యాలీ
కాగజ్‌నగర్, ఆగస్టు 4: ఎస్సీ వర్గీకరణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ గాంధీ చౌరస్తాలో ర్యాలీ ప్రారంభించగా, ప్రధాన వీధుల గుండా సాగింది. అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి, ఆపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.