నిర్మల్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లా సమీకృత కార్యాలయ భవన సముదాయం కంపు కొడుతున్నది. బీఆర్ఎస్ హయాంలో కోట్లాది రూపాయలు వెచ్చించి జీ ప్లస్ టూ విధానంలో అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా నిర్మించిన భవనాలు నిర్వహణ లేక దుర్గంధం వెదజల్లుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల కొరతతో నిర్వహణ సక్రమంగా చేయించలేక పోతున్నది. దీంతో కార్యాలయ ఉద్యోగులతోపాటు వివిధ పనుల నిమిత్తం వచ్చే సాధారణ ప్రజలు అవస్థలు పడుతున్నారు. నిర్మల్ కలెక్టరేట్ సముదాయంలో దాదాపు 57 శాఖల కార్యాలయాలు ఉండగా.. దాదాపు 1,000 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. మొత్తానికి కలెక్టరేట్ సముదాయ భవనం రెండేళ్లలోనే ‘పైన మెరుగు.. లోపల మురుగు’ అన్న చందంగా మారిందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కలెక్టరేట్లో సమస్యలను పరిశీలిస్తే..
కలెక్టరేట్ సముదాయంలో పారిశుధ్య నిర్వహణకు సిబ్బంది కొరత ఉంది. వాస్తవానికి 30 మంది సిబ్బందికి తొమ్మిది మంది ఉన్నారు. శానిటేషన్ కాంట్రాక్టు వ్యవస్థ లేకపోవడం వల్ల కొంత ఇబ్బందిగా ఉంది. రెండు మూడు నెలలుగా కార్యాలయంలోని లిఫ్టులు పనిచేయని మాట వాస్తవమే. లిఫ్టులకు యేటా మేయింటెనెన్స్ కోసం రూ.3 లక్షలకు పైగా చెల్లించాలి. నిధుల కొరత కారణంగా చేయించలేకపోతున్నాం. సందర్శకుల కోసం తాగునీరు అందుబాటులో ఉండేలా చూస్తాం.