గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నది. పంచాయతీలకు 2019 జనవరిలో ఎన్నికలు నిర్వహించగా.. అప్పుడు ఎన్నికైన సర్పంచ్లు, వార్డు మెంబర్ల పదవీకాలం 2024 ఫిబ్రవరి 1తో ముగుస్తున్నది. ఈ మేరకు కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని, ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అధికారుల ఎంపిక, శిక్షణకు సంబంధించి సూచనలు చేసింది. 200 మంది ఓటర్లకు ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక పోలింగ్ ఆఫీసర్.. 201 నుంచి 400 ఓట్లు ఉంటే ఒక ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ అధికారులు.. ఓటర్ల సంఖ్య 401 నుంచి 650 లోపు ఉంటే ఒక ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు పోలింగ్ అధికారులను నియమించాలని సూచించింది.
ప్రతి వార్డుకు తప్పనిసరిగా ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, ఓటర్ల సంఖ్య 650 దాటితే వార్డుకు రెండు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని పేర్కొంది. ప్రతి జిల్లాలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు గ్రామాల్లో సర్పంచ్లు, వార్డు మెంబర్ల రిజర్వేషన్లు, రెవెన్యూ జీపీలు, వార్డుల్లోని ఓటర్ల వివరాలను అధికారులు ఆన్లైన్ చేసే పనిలో నిమగ్మమైనట్లు తెలిసింది. – మంచిర్యాల, డిసెంబర్ 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి)