మంచిర్యాల, అక్టోబర్ 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లాలో సీఎంఆర్ ధాన్యం కొనుగోళ్లలో ఇందారం రైస్‌మిల్లర్ చేసిన గోల్మాల్ రోజుకో మలుపు తిరుగుతున్నది. భారీ స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్న ఈ వ్యవహారంలో విజిలెన్స్, టాస్క్‌పోర్స్ అధికారులు తీగలాగుతున్న కొద్దీ అక్రమాల డొంక కదులుతున్నది. మహారాష్ట్ర నుంచి ధాన్యం కొనుగోలు చేసి, ఆ ధాన్యం జైపూర్ మండలంలోని నర్సింగాపూర్ డీసీఎంఎస్ కేంద్రం నుంచి కొన్నట్లు రికార్డుల్లో చూపించారు. ఈ కేంద్రం నుంచి ఎక్కువ లారీల ధాన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న మిల్లర్‌కు మాత్రమే ట్యాగింగ్ ఇచ్చారు.
ఇది ఎలా సాధ్యమైందంటే సాధారణంగా ఏ మండలంలోనైనా వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈవో) క్రాప్ బుకింగ్ యాప్‌లో మండలంలో ఏ సర్వే నంబర్లో ఎంత భూమి ఉంది? అందులో ఏ పంట సాగైందన్న వివరాలు నమోదు చేస్తారు. కానీ.. జైపూర్‌లో మాత్రం ఏఈవోకు బదులు ఆయన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో క్రాప్‌బుకింగ్ యాప్‌లో సదరు మిల్లరే ఈ వివరాలు నమోదు చేసినట్లు విచారణలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయం తెలిసి విచారణ అధికారులే ఆశ్చర్యపోయినట్లు తెలిసింది. మంచిర్యాల జిల్లాలోని ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలున్నట్లు చెప్పుకునే సదరు మిల్లర్ ఏఈవో యూజర్ ఐడీ, పాస్వర్డ్ తీసుకొని క్రాప్ బుకింగ్ యాప్‌లో నాన్ డిజిటల్లీ సైన్డ్(ఎన్డీఎస్) ఆప్షన్‌ను మిస్ యూజ్ చేశాడు. వందల ఎకరాలు ఇష్ర్టారాజ్యంగా ఎన్డీఎస్ ఆప్షన్లో ఎక్కించి, ఆ భూముల్లో వరి పండించినట్లు చూపించి మహారాష్ట్ర ధాన్యం తెచ్చి ఇక్కడ డంప్ చేసినట్లు విచారణలో తేలినట్లు తెలియవచ్చింది.

ఏంటీ ఎన్డీఎస్ ఆప్షన్
మండలంలో పండిన పంట వివరాలను ఏఈవోలు క్రాప్ బుకింగ్ యాప్‌లో నమోదు చేస్తారు. కొన్ని పట్టాలు లేని భూములు ఉదాహరణకు (తండ్రి మరణాంతరం కొడుకులు సాగు చేస్తుంటారు. కానీ పట్టా తండ్రి పేరుపైనే ఉంటుంది. కొడుకుల పేరుపై ఉండదు. అలాంటప్పుడు పంట విక్రయించగా వచ్చే డబ్బులు పట్టా ఉన్న తండ్రి బ్యాంక్ ఖాతాలో కాకుండా కొడుకుల బ్యాంక్ ఖాతాల్లో పడాల్సి ఉంటుంది. మరికొన్ని కేసుల్లో రైతుకు ఉన్న మొత్తం భూమిలో కొంత భూమికే పట్టా ఉంటుంది.
కొంత భూమికి ఉండదు. కానీ.. ఆ భూమిలోనూ ఏదో సాగు చేస్తాడు. ఆ పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలి) ఇలా రెవెన్యూ పరమైన సమస్యల కారణంగా పట్టాలు లేని రైతులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో అలాంటి పట్టా లేని భూములు, సాగులో ఉన్న రైతుల వివరాలు క్రాప్ బుకింగ్ యాప్‌లో ఏఈవో నాన్ డిజిటల్లీ సైన్డ్(ఎన్డీఎస్) ఆప్షన్లో నమోదు చేస్తారు. ఇది చేస్తేనే పట్టాలు లేని రైతులు తాము పండించిన పంటలను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్దేశంతో ఏఈవోలకు ఇచ్చిన ఆప్షన్లో సదరు మిల్లర్ ఇష్టారాజ్యంగా వందల ఎకరాలు నమోదు చేసి, ఆ భూముల్లో ధాన్యం పండించినట్లు, ఆ ధాన్యం తన మిల్లుకు ట్యాగింగ్ చేయించుకున్నట్లు సమాచారం. నాన్ డిజిటల్లీ సైన్డ్(ఎన్డీఎస్) ఆప్షన్లో వందల ఎకరాలు చూపిస్తుండడంతో అనుమానం వచ్చి విచారణ చేయగా.. ఈ వ్యవహారం బయటికి వచ్చినట్లు ఉన్నతాధికారులు చెప్తున్నారు.
కాగా ఏఈవో యూజర్ ఐడీ, పాస్ వర్డ్ తీసుకొని ఇష్టారాజ్యంగా ఎంట్రీలు చేసి అధికారులను తప్పుతోవ పట్టించి, కోట్ల రూపాయల సీఎంఆర్ ధాన్యం స్కామ్ చేసిన సదరు మిల్లర్‌తోపాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు, ఇతర పాత్రదారులు దాదాపు 12 మందిపై చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలిసింది. ఈ విషయంపై ఇప్పటి దాకా జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అధికారక ప్రకటక రాకపోవడం గందరగోళంగా మారింది. రాజకీయ ఒత్తిళ్లతో జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందారంతోపాటు దుగ్నేపల్లి కొనుగోలు కేంద్రంపైనా విచారించిన అధికారులు ఆ కొనుగోలు కేంద్రం నిర్వాహకుడిపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, విజిలెన్స్-టాస్క్‌ఫోర్స్ అధికారులు ఈ విషయంపై స్పష్టత ఇస్తారా? లేదా? అన్నది వేచి చూడాలి.
