Telangana Martyrs | “మా బిడ్డల ప్రాణత్యాగం వృథా కాలే. వాళ్లు ఏం కావాల్నని కోరుకున్నరో అదే గిప్పుడైతంది. సీఎం కేసీఆర్ సార్ అన్నీ జేత్తండు. ఎవరికీ ఏం కావాల్నో అవన్నీ ఇత్తండు. మన నీళ్లు మనకచ్చినై.. నిధులచ్చినై.. నౌకర్లత్తన్నై.. గిట్లాంటి రోజు కోసమే సానా ఎదురుచూసిండ్రు. తెలంగాణ అత్తె ఏమేం లాభాలైతనయని అనుకున్నరో.. అవే గిప్పుడు జరుగుతన్నై.. మా బిడ్డలు బతికుంటే ఇయ్యాల సంబురపడేటోళ్లు.” అని తెలంగాణ అమరుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా.. అమరుల కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం అక్కున చేర్చుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 27 మంది ప్రాణత్యాగం చేయగా.. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున రూ.2.70 కోట్లు అందించింది. దీనికితోడు ఇంట్లో ఒక్కరికి అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి బతుకుదెరువు చూపించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు అమరులను స్మరించుకోనుండగా ‘నమస్తే’ ప్రత్యేక కథనం..
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం గ్రామ పంచాయతీల్లో ఉదయం11 గంటలకు సమావేశం అవుతారు. మున్సిపాలిటీలు, మండల పరిషత్తులు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్తులు, విద్యాలయాలు, ప్రార్థనా మందిరాల్లో శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటిస్తారు. అమరుల సంస్మరణ తీర్మానం చేస్తారు.
మంచిర్యాల, జూన్ 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలే.. ఆంధ్రోళ్ల పెత్తనం పోయి మా ఉద్యోగాలు మాకు రావాలే.. మా ప్రాంతాల అభివృద్ధికి నిధులు రావాలే.. అన్నింటికన్నా ముఖ్యంగా బీడుబడ్డ మా పొలాలకు నీళ్లు రావాలే.. ఇవన్నీ కావాలంటే ఉద్యమం చేయాలే.. అని నాటి తెలంగాణ ఉద్యమ సారధి, నేటి సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు యావత్ తెలంగాణ కదిలింది. ఊరూవాడా ఏకమై తెలంగాణ నినాదం ఎత్తుకుని ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లింది. కానీ.. నాటి కేంద్ర ప్రభుత్వాలు స్పందించ లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు అసలే పట్టించుకోలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవతరణకు అడ్డంకులు తొలిగిపోయాకునేలోగా ఆంధ్రోళ్లు కాళ్లల్లో కట్టెపెట్టడం.. అధిష్టానాన్ని కలిసి తెలంగాణ స్వరాష్ట్రం ఇస్తే తాము రాజీనామాలు చేస్తామని బెదిరించడం.. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్రలు చేయడం.. ఇవన్నీ చూసి తెలంగాణ స్వరాష్ట్రం కల నెరవేరదేమోననే ఆందోళనలతో చాలా మంది ప్రాణత్యాగం చేశారు.
ఎంత కొట్లాడినా తెలంగాణ రాదు.. మా బతుకులు బాగు పడయ్.. మాకు ఉద్యోగాలు రావు.. అని లెటర్లు రాసి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ మరణాలు చూసి చలించిన కేసీఆర్ తెలంగాణ కోసం ఇగ ఒక్క ప్రాణం కూడా పోకూడదు.. ఏదైనా నాతో తేలిపోవాలే.. నేను సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. ఏదో ఒకటి జరగాలని ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అదే చివరి ఘట్టంగా తెలంగాణను అనుకూలమైన ప్రకటన వచ్చింది. 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన ఒక్కో అమరుడికి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయడంతోపాటు వారి కుటుంబంలోకి ఒకరికి ఉద్యోగం కల్పించి అండగా నిలిచారు. ఆ కుటుంబాలకు సముచిత గౌరవం దక్కేలా చర్యలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా అమరుల కుటుంబాలను ‘నమస్తే తెలంగాణ’ పలకరించింది.
బుద్దె సుమన్.. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని కోనూర్. పక్కనున్న దేవాపూర్‌లో పదో తరగతి వరకు చదువుకున్నడు. వరంగల్ ఎస్ఆర్ కళాశాలలో చేరాక బంద్‌లు వచ్చినయ్. ఎప్పుడూ వార్తలు చూసేటోడు. వార్తల్లో ఆంధ్రవాళ్ల కుట్రలు, కుతంత్రాలు చూసి తెలంగాణ రాదేమోననే బెంగతో పురుగుల మందు తాగి.. జై తెలంగాణ నినాదాలు చేస్తూ కుప్పకూలిండు. దవాఖానకు తీసుకెళ్తుంటే.. ఇంత పని ఎందుకు చేసినవ్ బిడ్డా అని తల్లిదండ్రులు అడగ్గా.. ‘నా చావుతోనైనా తెలంగాణ వస్తదేమోనే.. నా అసొంటోళ్లకు ఎంతో మందికి ఉద్యోగాలు వస్తయ్’ అని చివరి మాటలు చెప్పి మార్గమధ్యంలోనే తుది శ్వాస విడిచిండు. తెలంగాణ వస్తే ఏమవుతుందని సుమన్ కలలు కన్నాడో.. ఈ రోజు ప్రగతి కండ్ల ముందు సాక్షాత్కరిస్తున్నదని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. సుమన్ చేసిన త్యాగాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ ఆయన తల్లిదండ్రులైన కళావతి-తిరుపతికి రూ.10 లక్షలు, ఆయన అన్న అశోక్‌కు స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చి గౌరవించింది.
మా తమ్ముడు సుమన్ తెలంగాణ ఎట్లా వస్తది. ఎప్పుడు వస్తది అని ఆలోచి స్తుండే. డిసింబర్ 9, 2009లో తెలంగాణ ప్రకటన వెలుబడ్డాక, తిరిగి వెనక్కి తీసుకున్నారని తెలిసి చాలా బాధ పడ్డడు. చివరకు తట్టుకోలేక ఆత్మ బలిదానం చేసుకున్నడు. కాలేజీ తరఫున ర్యాలీలు, నిరాహార దీక్షల్లో చురుకుగా పాల్గొనేది. తెలంగాణ వస్తేనే మనకు ఉద్యోగాలు వస్తయ్ అని ఊకే చెప్పేటోడు. తమ్ముడు చనిపోయాక నాకు స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. తెలంగాణ కోసం మా తమ్ముడు ఏదైతో అనుకున్నాడో అది నూటికి నూరు శాతం నెరవేరుతున్నది. లెక్కలేనన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఈ రోజు తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.
– అశోక్, అమరుడు సుమన్ అన్న
నా చిన్న కొడుకు సుమన్ తెలంగాణ కోసం చనిపోయిండు. చెట్టంత కొడుకు లేడని గుర్తుకు వచ్చిన ప్రతిసారి నాకు ఏం తోచదు. వాడికున్న ఆలోచన మా ఇంట్లో ఎవరికీ లేదు. చిన్న వయసులోనే నలుగురి కోసం ఆలోచించిండు. ఎప్పుడు చూసినా తెలంగాణ గురించే మాట్లాడేటోడు. సెలవులకు ఇంటికి వచ్చిండంటే చాలు తెలంగాణ మీద ఏం జరుగుతుందని వార్తల్లో చూసేటోడు. ఆ వార్తలు పెట్టొద్దు అంటే వినేటోడు కాదు. కొడుకు లేడన్న బాధ లేకుండా సీఎం కేసీఆర్ మా కుటుంబాన్ని ఆదుకున్నడు. రూ.10 లక్షల సాయంతోపాటు మా పెద్దబ్బాయికు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. కేసీఆర్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాం.
– కళావతి, అమరుడు సుమన్ తల్లి
ఇప్పుడు మేం బతుకున్నది సుమన్ మాకు ఇచ్చిన బతుకే. ప్రభుత్వం చేసిన సాయం, మా కుటుంబానికి ఇచ్చిన ఉద్యోగం మాకు ఉపయోగపడింది. మా పెద్ద కొడుక్కి మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఉద్యోగం ఇవ్వడంతో ఊరు వదిలేసి వచ్చి ఇక్కడే ఉంటున్నాం. తెలంగాణ రావాలని నా బిడ్డ తపన పడ్డడు. కానీ. రాక ముందే లేకుండా పోయిండు. ఇప్పుడు వాడు ఉండిఉంటే ఎంత సంబురపడునో కొడుకు. తెలంగాణ ఉద్యమ సమయంలో గివన్ని మనకు అవసరమా బిడ్డ అంటే మనకు కావాలే బాపు. నీకు ఏం తెల్వదు. ప్రత్యేక రాష్ట్రం వస్తేనే మన బతుకులు బాగుంటయ్ అనేటోడు.
– తిరుపతి, అమరుడు సుమన్ తండ్రి
కాసిపేట, జూన్ 21 : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని నా భర్త తోట శ్రీనివాస్ తపన పడేవారు. సీమాంధ్రుల కుట్రలు చూసి తెలంగాణ రాదేమోనని బెంగతో రాష్ట్ర ఏర్పాటులో నేను పాలుపంచుకుంటానని, తెలంగాణలో నా చావే చివరిది కావాలని చెప్పి ఫిబ్రవరి 7, 2014న ఆత్మ బలిదానం చేసుకున్నాడు. మా కుటుంబానికి ఆదారం చూపిస్తూ తండ్రిలా సీఎం కేసీఆర్ మాకు అండగా ఉంటున్నాడు. ఆర్థికంగా సహాయం చేయడంతోపాటు ఇప్పుడు నాకు కాసిపేట మండలంలోనే సంక్షేమ హాస్టల్లో ఉద్యోగం ఇప్పించారు. నా భర్త ఎక్కడ ఉన్నా సంతోషిస్తాడు. ఈ ఉద్యోగంతో నా ఇద్దరు పిల్లలు సాయి, సిరిలను ఏ లోటు లేకుండా చదివిస్తున్నా.
– అమరుడు తోట శ్రీనివాస్ భార్య సునీత
కాసిపేట, జూన్ 21 : మా కూతురు నూర కల్పన తెలంగాణ రాదన్న బెంగతో ఫబ్రవరి 2, 2010లో ప్రాణత్యాగం చేసింది. డిగ్రీ పూర్తి చేసిన మా బిడ్డ తెలంగాణ వస్తే అందరి బతుకులు బాగు పడుతాయని ఆశ పడి ఎదురు చూసింది. అప్పటి ఆంధ్రనాయకుల దౌర్జన్యం చూసి తెలంగాణ రాదేమో నని ఆవేదనకు గురై ప్రాణాలు తీసుకుంది. అమరుల త్యాగాలను మరవకుండా వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండటం ఎంతో ధైర్యంగా ఉంది. ఆర్థిక సాయం చేయడంతోపాటు ఉద్యోగం ఇచ్చిన సీఎం కేసీఆర్ చేసిన మేలు మరువలేనిది. కల్పన అమ్మనైన నాకు బెల్లంపల్లి పాలిటెక్నికల్ కళాశాలలో వంట మనిషిగా ఉద్యోగం ఇచ్చారు.
– అమరురాలు కల్పన తల్లి లచ్చన్న, లక్ష్మీ
Mallaiah
నీళ్లు, నిధులు, నియామకాల నినాదం మీద ఏర్పడ్డ తెలంగాణలో నాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. ఆ రకంగా నేను ఉద్యమ నినాదంలో భాగస్వామినైనందుకు ఆనందంగా ఉంది. మా ఊరు పక్క నుంచే గోదావరి పోతది. కానీ గతంలో తాగేం దుకు గుక్కెడు నీళ్లు దొరికేవి కాదు. నా చిన్నతనంలో ఎప్పుడు చూసిన గోదారి ఎండిపోయే కనిపించేది. కానీ.. ఈ రోజు ఇంత ఎండకాలంలోనూ నిండు కుండలా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో ఒక్కసారిగా అంతా మారిపోయింది. భూ గర్భ జలాలు పెరిగి ఒకప్పుడు బీడుబడిన భూముల్లో ఈ రోజు పంట పండుతున్నది. నేను జూనియర్ అసిస్టెంట్‌గా చేరి మొన్ననే సీనియర్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ తీసుకున్నందుకు ఆనందంగా ఉంది.
– సంపత్, మల్లయ్య చిన్న కొడుకు