కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా రెచ్చిపోతున్నది. అక్రమార్జనకు అలవాటుపడిన బియ్యం స్మగ్లర్లు కొందరు అధికారులు, పోలీసులతో భేరాలు కుదుర్చుకొని మరీ దందా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి!? ఇద్దరు స్మగ్లర్ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడం, ఇందులో అధికారులతో జరిగిన ఒప్పందాలపై ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. రేషన్ బియ్యం స్మగ్లర్ల మధ్య వచ్చిన విభేదాల కారణంగా ఒకరి అక్రమ రవాణాను మరొకరు బయటపెడుతున్నారు. సమాచారం అందుకుంటున్న పోలీసులు బియ్యం వాహనాలను పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కాగజ్‌నగర్‌లో ఇన్ఫార్మర్ అనే అనుమానంతో మంగళవారం రాత్రి ఓ యువకుడిపై స్మగ్లర్లు దాడి చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పేదలకు ఉచితంగా అందించాల్సిన రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రకు అక్రమంగా తరలించడమే వృత్తిగా మార్చుకున్న స్మగ్లర్లు సంబంధిత అధికారులను మచ్చిక చేసుకొని కాగజ్‌నగర్ కేంద్రంగా దందాను కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. స్మగ్లర్లలో విభేదాల కారణంగా విడిపోయి వేర్వేరుగా దందా చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకరి అక్రమ రవాణాపై మరొక స్మగ్లర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం పట్టుబడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. స్మగ్లర్లతో మంచి సంబంధాలను కలిగి ఉన్న పోలీసులు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పుడప్పుడు మాత్రమే అక్రమ బియ్యాన్ని పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రేషన్ బియ్యాన్ని సేకరించి రాష్ట్ర సరిహద్దు మండలమైన సిర్పూర్-టీ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నారు.
స్మగ్లర్ల మధ్య సంభాషణ వైరల్..
బియ్యం అక్రమ రవాణాపై పోలీసులు, ఇతర అధికారులతో ఒప్పందం చేసుకున్న స్మగ్లర్ల మధ్య జరిగిన సంభాషణ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సిర్పూర్ నియోజకవర్గంలోని మహారాష్ట్ర సరిహద్దు మండలంలో ఎస్ఐగా పనిచేస్తున్న ఎస్ఐకి రూ.50 వేలు, తహసీల్దార్‌కు రూ.20 వేలు, రవాణా శాఖ వాళ్లకు రూ.15 వేలు, సివిల్ సప్లయ్ అధికారులకు కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకున్నట్లు స్మగ్లర్లు చర్చించుకున్నారు. పోలీసులు సూచించిన విధంగా సాయంత్రం 7నుంచి 10 గంట ల వరకు, ఉదయం 3 గంటల నుంచి 7 గంట ల వరకు మాత్రమే బియ్యం వాహనాలు బార్డ ర్ క్రాస్ చేయాలని స్మగ్లర్లు మాట్లాడుకున్నారు. సిర్పూర్లో మంగళవారం పెద్ద మొత్తంలో రూ.7.48 లక్షల విలువైన 208 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. ఇన్ఫార్మర్ నెపంతో కాగజ్‌నగర్‌లో అక్రం ఖాన్ అనే వ్యక్తిపై దాడిచేయడంతో స్మగ్లర్లకు పోలీసులకు ఉన్న సంబంధాలు బయటపడుతున్నాయి.
ఆగని అక్రమ రవాణా..
కాగజ్‌నగర్ కేంద్రంగా రేషన్ బియ్యం వాహనాలను సిర్పూర్ మీదుగా బైపాస్ రూట్లలో బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్నారు. మహారాష్ట్రలోని వీరూర్ ప్రాంతంలో అక్కడి వ్యాపారులు ప్రత్యేకంగా గోదాంలను ఏర్పాటు చేసుకొని ఇక్కడి బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో రేషన్ బియ్యాన్ని కిలోకు రూ.12 నుంచి 15 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్న స్మగ్లర్లు మహారాష్ట్రలో 30 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. అక్రమ బియ్యం వ్యాపారంలో అధిక లాభాలు వస్తుండడంతో అధికారులతో ఒప్పందాలు చేసుకొని మరీ స్మగ్లరు బియ్యం రవాణే తమ వృత్తిగా మలుచుకొని దందాలు కొనసాగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
దాడి చేసిన వారిపై కేసు నమోదు
కాగజ్‌నగర్, ఫిబ్రవరి 12: పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన అక్రమ్ ఖాన్‌పై మంగళవారం రాత్రి దాడి చేసిన ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ రాజేంద్ర ప్రసాద్ బుధవారం తెలిపారు. రేషన్ బియ్యం రవాణాపై పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావంటూ అక్రమ్ఖాన్పై రజాక్, ఫారూఖ్, సమీర్ దాడి చేశారని బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా కాకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. సిర్పూర్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం పట్టుకున్న మరిన్ని చర్యలు తీసుకుంటున్నాం. బార్డర్లో రెండు చెక్‌పోస్టులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. బియ్యం అక్రమ రవాణా చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. అక్రమ రవాణా దందాపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతామని తెలిపారు.
– డీవీ శ్రీనివాస రావు, జిల్లా ఎస్పీ
చెన్నూర్ మార్కెట్ కమిటీ కార్యదర్శి సస్పెన్షన్
చెన్నూర్, ఫిబ్రవరి 12: చెన్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి రామాంజనేయులను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర మార్కెటింగ్ అధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీసీఐ ద్వారా జరుగుతున్న పత్తి కొనుగోళ్ల విషయంలో కౌలు రైతులకు సంబంధించిన డాటా తాత్కాలిక రిజిస్ట్రేషన్‌లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై కార్యదర్శిని సస్పెండ్ చేశారు. ఈ అవకతవకలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టనున్నట్లు తెలిసింది.