నార్నూర్ : గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల హాస్టళ్లలోని డైలీ వేజ్ ఔట్సోర్సింగ్ కార్మికుల (Hostel Workers) సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న ( Bojja Ashanna) డిమాండ్ చేశారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంతో పాటు జామడ, తాడిహత్నూర్, మాన్కాపూర్, భీంపూర్లోని హాస్టళ్ల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల హాస్టల్లో పనిచేస్తున్న కార్మికులకు ఆరు నెలల నుంచి వేతనాలు రాక కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. కనీస వేతనాన్ని రూ. 26వేలకు పెంచాలన్నారు. జీవో నెంబర్ 64 తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్మికుల పక్షాన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు వెంకట్రావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.