మంచిర్యాల, మే 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూర్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. నియోజకవర్గవ్యాప్తంగా ఎక్కడ చూసినా కల్లాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే కనిపిస్తున్నది. తూకం వేసిన ధాన్యాన్ని తరలించకపోవడంతో కాం టా పెట్టిన వడ్లు పదిహేను, ఇరవై రోజులుగా కల్లాల్లోనే ఉంటున్నా యి. నిబంధనల ప్రకారం తూకం వేసిన 24 గంటల్లో వడ్లను తరలించాలి. కానీ.. మంచిర్యాల జిల్లాలో ముఖ్యంగా చెన్నూర్ నియోజకవర్గంలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.
పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో మంచిర్యాల వడ్లను దించుకోవడం లేదని చెప్పి చేతులు ఎత్తేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. స్వయంగా మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తుండడం, ఆయన కుమారుడు వంశీ పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పటికీ పెద్దపల్లి జిల్లాకు మంచిర్యాల ధాన్యం తరలించడంలో విఫలమవుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఎంపీ వంశీ ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దపల్లి జిల్లాలో ఆయన మాటవినే పరిస్థితి లేదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బాధ్యత తీసుకొని ధాన్యం తరలించాల్సిన మంత్రి, ఎంపీలు క్షేత్రస్థాయిలో పరిస్థితులు సమీక్షించకుండా, రైతులకు పరిష్కారం చూపించకుండా ఏం చేస్తున్నారంటూ రైతులు మండిపడుతున్నారు. ఎక్కడి ధాన్యం అక్కడే ఉండి రైతులు అవస్థలు పడుతుంటే ఏం చేస్తున్నారంటూ నిలదీస్తున్నారు.
ధాన్యం పోవాలంటే నెల రోజులు ఆగాల్సిందే..
సీజన్ ప్రారంభంలో జరిగిన జాప్యం ధాన్యం కొనుగోళ్లపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నది. కేంద్రాలకు ధాన్యం తెచ్చి 20 రోజులు పూర్తయితే గానీ తూకం వేయడం లేదు. తూకం వేసిన ధాన్యం నిబంధనల ప్రకారం 24 గంటల్లో తరలించాలన్న నిబంధన ఉన్నా.. లారీలు, గోదాముల కొరత ఉందని 15 రోజుల నుంచి 20 రోజులు కల్లాల్లోనే ఆపుతున్నారు. దీంతో కల్లాలకు ధాన్యం తెచ్చిన రైతు నెల రోజులు, నెలన్నర రోజులు కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారు.
వర్షం వచ్చినా, ఈదురుగాలులు వచ్చినా పంట నష్టం వస్తుందన్న భయంతో రాత్రింబవళ్లు తేడా లేకుండా కల్లాల్లోనే ఉంటున్నారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా చెన్నూర్ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. క్వింటాలుకు ఏడున్నర కిలోలు అదనంగా తూకం వేస్తున్నారని, మిల్లుకు వెళ్లాక ఓటర్న్ పేరిట మరో రెండు నుంచి మూడు కిలోలు కోత పెడుతున్నారని.. క్వింటాలుపై ఇలా 10 కిలోలు దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. పదిహేను, ఇరవై రోజులు ఎదురు చూశాక ఈ దోపిడీకి ఒప్పుకుంటేనే తూకం వేస్తున్నారని, తూకం వేసిన వడ్లను మరో పదిహేను ఇరవై రోజులకు లోడింగ్ చేస్తున్నారని మండిపడుతున్నారు.

లారీ డ్రైవర్ల అవస్థలు
కొనుగోలు కేంద్రాల్లో లోడ్ చేసిన లారీలను మిల్లులు, గోదాములకు తీసుకువెళ్లాక అన్లోడ్ చేసేందుకు వారం నుంచి పది రోజులు సమయం పడుతున్నది. మిల్లులకు వచ్చిన తమను పట్టించుకునే నాథుడు లేక అవస్థలు పడుతున్నామని లారీ డ్రైవర్లు వాపోతున్నారు. జైపూర్ మండలం ఇందారం సమీపంలోని ఓ మిల్లు సమీపంలో వందల లారీలు బారులుదీరాయి. 600 బస్తాల నుంచి 1000 బస్తాల లోడ్‌తో వచ్చి వారం రోజులు అవుతున్నా అన్లోడ్ కావడం లేదని లారీల యాజమానులు, డ్రైవర్లు పోతున్నారు.
ఇన్ని రోజులు ధాన్యం లారీల్లోనే ఉంచితే టైర్లు దెబ్బతింటున్నాయంటున్నారు. అన్‌లోడింగ్‌కు రోజుల తరబడి సమయం పడుతుండడంతో తినేందుకు తిండి లేక, తాగేందుకు మంచినీరు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. రోడ్లపై మా లారీలు ఖాళీగా కనిపిస్తే ఆర్డీవో ఆపి రైతుల కోసం పంపిస్తున్నారని, తీరా వచ్చాక ఇచ్చే ఆరు నుంచి ఏడు వేలు కిరాయికి వారం, పది రోజులు పడుతుండడంతో తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు. ప్రభుత్వం స్పందించి లారీల అన్లోడింగ్ ఒకటి, రెండు రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. అవసరమైతే పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు పంపి అన్లోడింగ్ చేయించాలంటున్నారు.
పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ విడుదల చేసిన వీడియో..
పెద్దపల్లి జిల్లాలో మంచిర్యాల ధాన్యం దించుకోవడం లేదు. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎస్‌కు లేఖ రాశాం. రిక్వెస్ట్ చేశాం. జిల్లా మంత్రి శ్రీధర్ బాబుకూ లేఖ రాశాం. తక్షణమే ధాన్యం దించుకోవాలని, రైతులకు రిలీఫ్ ఇవ్వాలని కోరాం. కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం కావొద్దు అని జిల్లా అధికారులను కోరుతున్నా. రైతులు రోడ్డెక్కుతున్నారు. ఎండలో కష్టపడి వాళ్లు ధర్నాలు చేస్తున్నారు. దీనిపై స్పందించి తక్షణమే ధాన్యం దించుకోవాలి. అంటూ వీడియోలో మాట్లాడారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఎంపీగా ఉండి లేఖరాశానని ఎలా చెప్తారంటూ నిలదీస్తున్నారు.
డ్రైవర్లం గోస పడుతున్నం
ఇందారం రైస్ మిల్లుకు ధాన్యం తీసుకొచ్చి ఆరు రోజులైంది. అన్ని రోజులుగా లోడ్‌తో లారీని ఉండడంతో ఎయిరొచ్చి ఓ టైర్ పగిలిపోయింది. స్టెప్ని వేసుకున్నా. ఇప్పుడా పగిలిపోయిన టైర్ ఎవరు కొనివ్వాలి? దానికి బాధ్యత ఎవరు తీసుకోవాలి? వచ్చేది రూ.ఆరేడు వేల కిరాయి. దానికి ఐదారురోజులు ఎదురుచూడాలంటే ఇబ్బంది అవుతున్నది. ఇక్కడ తాగేందుకు మంచినీరు లేక బోర్ నీళ్లు తాగుతున్నాం. పొద్దంతా 20 లారీలు ఖాళీ అవ్వడం లేదు. క్యూలో 130 లారీలున్నాయి. మా వంతు వచ్చేప్పటికీ ఏ రోజు అవుతుందో అర్థమైతలేదు. తక్షణం సర్కారు స్పందించి ధాన్యం అన్లోడ్ను వేగంగా పూర్తి చేయాలి.
– సీహెచ్. లింగయ్య, లారీ డ్రైవర్.
ధాన్యం కొనే దిక్కులేదు..
మాది మంచిర్యాల జిల్లా భీమారం గ్రామం. నాకున్న రెండెకరాల్లో వరి సాగు చేసిన. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి వారం రోజులైంది. నాపక్కనున్న కప్పు తూకం వేసి 20 రోజులైనా ఇప్పటికీ లోడింగ్ కాలేదు. ఆ వడ్లు పోతేనే మా వడ్లు తూకం వేస్తామంటున్నారు. కాంట పెట్టిన కుప్పలు ఎక్కడికి అక్కడే ఉన్నయ్. లారీ ఎప్పుడు రావాలే, ఆ వడ్లు ఎప్పుడు పోవాలే. రోజుల తరబడి కల్లాల్లోనే కాపలా ఉంటున్నా ధాన్యం కొనే దిక్కులేకుండా పోయింది.
– లచ్చానాయక్, రైతు, భీమారం
నెల రోజులయ్యాక తూకం పెడుతున్నరు
నేను 12 ఎకరాల్లో వరి వేసిన. మా సమీపంలోని కొనుగోలు కేంద్రానికి గత నెల (ఏప్రిల్) 27వ తేదీన ధాన్యం తెస్తే ఈ రోజు (మే)20వ తేదీన తూకం పెడుతున్నారు. బస్తాకు మూడు కిలోలు కటింగ్ పెడుతున్నారు. నెల రోజులు ఎదురు చూస్తే ఇయ్యాల కాంట అయితంది. లారీలు వస్త లేవని, సంచులు లేవని ఆపారు. నెలరోజులకు కాంట అయితంది. తూకం వేసిన బస్తాలు ఎప్పుడు తీసుకుపోతరో తెల్వదు. వర్షాలు రాకముందే ధాన్యం తరలించాలి. కొరత లేకుండా సరపడా గోనె సంచులు సరఫరా చేయాలి.
– రాజబాపు గౌడ్, రైతు, సుద్దాల
