జాతీయ స్థాయి సబ్ జూనియర్ బాల్‌బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలు నేటి(గురువారం) నుంచి మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు సాగే ఈ క్రీడా సంబురంలో 25 రాష్ర్టాల నుంచి 800 మంది బాలబాలికలు పాల్గొననున్నారు. ఇందుకోసం నిర్వాహకులు పూర్తి ఏర్పాట్లు చేయగా, ప్రారంభ వేడుకకు మంత్రి, విప్‌తో పాటు మరికొందరు ప్రముఖులు రానున్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వివిధ రాష్ర్టాల క్రీడాకారులతో దేశజట్టును ఎంపిక చేయనున్నారు.
శ్రీరాంపూర్, ఫిబ్రవరి 15 : మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కాలనీ ప్రగతి స్టేడియం..41వ జాతీయస్థాయి అండర్-15 సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలకు వేదికైంది. బ్యాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో తెలంగాణ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా అసోసియేషన్ ఈ నెల 16 నుంచి 20 వరకు సింగరేణి సహకారంతో నిర్వహిస్తున్నది. కాగా, టోర్నీ ఆర్గనైజింగ్ కార్యదర్శి, ఉమ్మడి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మైదానం ముస్తాబైంది. జిల్లాలో జాతీయస్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు 3వ సారి కొనసాగుతున్నాయి. ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా 25 బాలుర, 25 బాలికల బాల్ బ్యాడ్మింటన్ జట్లు పాల్గొననున్నాయి. 800 మంది క్రీడాకారులు, 30 మంది రెఫరీలు, 49 మంది ఆర్గనైజర్లు, 20 మంది రాష్ట్ర అఫీషియల్స్ పాల్గొననున్నారు. క్రీడాకారులకు, అతిథులకు భోజనం, సౌకర్యాలు కల్పించారు.
ముఖ్య అతిథులుగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మంచిర్యాల కలెక్టర్ బాదావత్ సంతోష్, బాల్ బ్యా డ్మింటన్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేశ్, రాష్ట్ర అసోసియేషన్ చైర్మన్ శ్రీనివాసరావు, మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్న య్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్, జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్షి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్, ప్రధా న కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి హాజరుకానున్నారు.
ఈ 41వ జాతీయస్థాయి బాల్ బ్యాడ్మిటన్ చాంపియన్ షిప్ పోటీలకు దేశ వ్యాప్తంగా 25 రాష్ర్టాల నుంచి క్రీడాకారులు, అఫీషియల్స్, కోచ్‌లు హాజరుకానున్నారని టోర్నీ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్ నారాయణరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్, బిహార్, ఛండీఘర్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లి, గుజరాత్, హర్యాన, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, డీఏఈ. న్యూఢిల్లీ, పచ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ర్టాల నుంచి పాల్గొంటారని చెప్పారు.
ఈ పోటీల్లో ప్రతిభ గల క్రీడాకరులను ఇండియా జట్టుకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వివిధ దేశాల్లో జరిగే ఏషియన్ గేమ్స్‌కు కూడా ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. 2006లో మొదటి సారిగా బెల్లంపల్లిలో సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయి. 2వ సారి 2016లో గోలేటిలో జరిగాయి. ఇప్పుడు మూడోసారి శ్రీరాంపూర్ వేదికైంది. స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి సందర్శించి, పరిశీలించారు.
ఈ నెల 10 నుంచి 12 వరకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో 41వ రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు సాగాయి. ఇందులో రాష్ట్ర జట్టును ఎంపికచేశారు. ఈ జట్టుకు హైదరాబాద్‌లో తెలంగాణ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ ఎం శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఏ రవీందర్ ఆధ్వర్యంలో కోచింగ్ క్యాంప్ కొనసాగింది.
జాతీయస్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలకు ఎంపికైన రాష్ట్ర బాలుర జట్టులో బీ రాజేశ్, డీ సిద్ధు (నల్గొండ), కే ఆకాశ్, కే యశ్వంత్ (కరీంనగర్), ఎన్ ధీక్షిత్, ఎం మొగులాజి (నిజామాబాద్), కే లక్ష్మీనరసింహ (రంగారెడ్డి), వీ సిద్ధార్థ (మెదక్), వీ నిఖిల్ (హైదరాబాద్), సీహెచ్ గోపాలశ్రీ కృష్ణ (ఆదిలాబాద్) ఉన్నారు.
బాలికల జట్టుకు బీ సహస్ర, ఎం కీర్తి, పీ శ్రీహర్షిని (ఖమ్మం), జే గాయత్రి, బీ రాధిక (మెదక్), కే హర్షిత, ఎం సన్నిధి (వరంగల్), ఆర విష్ణుప్రియ (ఆదిలాబాద్), సీహెచ్ కవిత (హైదరాబాద్) ఎంపికయ్యారు.