మంచిర్యాలటౌన్, సెప్టెంబర్ 29 : మంచిర్యాల గోదావరి శాంతించడం లేదు. ఎగువ ప్రాంతం నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతుండగా, ఏడు లక్షల క్యూసెక్కులకు పైగా గోదావరిలోకి వరద వదులుతున్నారు. సోమవారం అర్ధరాత్రి ఒంటిగంటకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శ్రీరాంసాగర్ నుంచి 450000 క్యూసెక్కులు, కడెంప్రాజెక్టు నుంచి 4 వేల క్యూసెక్కులు, క్యాచ్మెంట్ ద్వారా 262209 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది.
దీంతో ప్రాజెక్టుకు ఉన్న 62 గేట్లలో 43 గేట్లు ఎత్తి 697202 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదిలారు. ఉదయం 3 గంటలకు 751964 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 727159 క్యూసెక్కులు, ఉదయం 6 గంటలకు 744482 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 731670 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. ఉదయం 9 గంటలకు 747531 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో ఉండగా, 43 గేట్లు ఎత్తి 734746 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. మధ్యాహ్నం 12 గంటలకు 658791 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 701932 క్యూసెక్కులు, మధ్యాహ్నం మూడు గంటలకు 648084 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 691225 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు.
గోదావరి తీరాన ఉన్న గౌతమేశ్వర ఆలయం ముందు వరకు నీరు వచ్చి చేరింది. సమ్మక్క, సారలమ్మ గద్దెలు, పుష్కరఘాట్లు, స్నానఘట్టాలు, వేచి ఉండే గదులు నీట మునిగాయి. రాళ్లవాగు ప్రవాహం గోదావరిలో కలిసే చోట వెనక్కి తంతుండడంతో పక్కనే ఉన్న ఎన్టీఆర్నగర్, రాంనగర్ ఏరియాల్లోని రోడ్ల పైకి వరద వచ్చి చేరింది. ఎన్టీఆర్ నగర్లో కొన్ని ఇండ్ల మధ్యకు నీరు వచ్చింది.
నీట మునిగిన పంటలు
కోటపల్లి, సెప్టెంబర్ 29 : గోదావరి నది ప్రవా హం పెరగడంతో సమీపంలోని పంటలు నీట మునిగాయి. కొల్లూరు, బోరంపల్లి, రావులపల్లి, రాంపూర్, దేవులవాడ గ్రామాల సమీపంలో సాగు చేస్తున్న పత్తి, వరి, మిర్చి పంటలు నీటిలోనే ఉండిపోయాయి.