దస్తురాబాద్, డిసెంబర్ 25 : ఉన్న ఊరిలో ఉపాధి కల్పించి వలసలు నివారించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలవుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సత్ఫలితాలిస్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మండలంలో ఉపా ధి జాతర ప్రారంభం కానుంది. వేలాదిమంది కూలీలకు అధిక పని దినాలు దొరకనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం 2023-2024లో చేపట్టే పనుల గుర్తింపు ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం సర్పంచుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 2న ఉపాధిహామీ గ్రామ సభలు ప్రారంభమాయ్యయి. నవంబర్ 29 వరకు తుది(ముగింపు) గ్రామ సభలు నిర్వహించారు. ఈ గ్రామ సభల్లో గుర్తించిన పనులకు ఆమోదం తెలిపి తీర్మానించారు. ఉపాధి హామీ పనుల రూపకల్పనకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎక్కువ మంది వచ్చే పనులపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 56 రకాల పనులను గుర్తించి ప్రణాళికలు రూపొందించి వాటికి నిధులు విడుదల చేస్తున్నది.
పనుల గుర్తింపునకు గ్రామసభలు..
ఉపాధి హామీ నిధులు రావాలంటే గ్రామ సభల్లో గుర్తించిన పనులే కీలకం కానున్నాయి. ప్రస్తుతం నిర్వహిస్తున్న సభల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు గ్రామ సభలకు హాజరై గ్రామ అభివృధ్ధి, వ్యక్తిగత పనులతో పాటు రైతులు పంట చేలల్లో, వ్యవసాయ భూముల్లో అవసరమైన పనులను గుర్తించవచ్చు. గ్రామసభలో ఆమోదం పొందిన వెంటనే పనులను చేపట్టే వీలుంటుంది. ప్రస్తుతం నిర్వహించే గ్రామ సభలో పనుల వివరాలను నమోదు చేయకుంటే మరో సంవత్సరం వరకు నిరీక్షించాల్సి ఉంటుంది.
గుర్తింపు ఇలా..
ఉపాధి హామీ పథకంలో 56 రకాల పనులపై మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. ఇందులో 26 నుంచి 30 వరకు కావాల్సిన పనులను గుర్తించారు. ప్రధానంగా నర్సరీల ఏర్పాటు, హరితహారం మొక్కల సంరక్షణ, నీటి కుంటలు, కందకాలు తవ్వడం, పూడికతీత, పశువుల పాకలు, గొర్లు మేకల పాకలు, పశుగ్రాసం పెంపకం, పండ్ల తోటలు, ఇంకుడు గుంతల నిర్మాణం, గ్రామాభివృద్ధి, పంటల పొలాలకు మట్టి రోడ్డు నిర్మించడం, రహదారుల నిర్మాణం, బంజారు భూములు సాగులోకి మార్చడం, నూతన వ్యవసాయ బావుల నిర్మాణం, వ్యక్తిగత, సామూహిక పాంపాండ్ తవ్వకం, నాడెపు, వర్మీ కంపోస్టు పిట్ నిర్మాణాలు, పశువుల నీటి తొట్టెలు, పాత వ్యవసాయ బావుల్లో, కాలువల్లో పూడికతీత, కొత్త కాలువల తవ్వకం, చెరువులు, చెక్ డ్యాంలలో పూడికతీతతో పాటు వివిధ రకాల పనులున్నాయి. ఏవి అవసరమో అవి గ్రామసభలో ఆమోదించవచ్చు.
నిర్ణయం ఇలా..
గతంలో ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పనులను గుర్తించి అవసరమైన మేరకు చేసేవారు. కానీ రెండేండ్ల నుంచి గ్రామసభల్లో గుర్తించిన పనులకు ఆమోదం పొందుతున్నారు. దీనికి సంబంధించిన గ్రామసభ తీర్మానం తప్పనిసరి. కొత్త విధానం ప్రకారం ఉపాధిహామీ పథకంలో చేపట్టిన అన్ని పనులను కంప్యూటర్లో నమోదు చేయాలి. తీర్మానాన్ని ఉపాధి హామీ పథకం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ పనులను మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో తీర్మానం చేసి ఆమోదిస్తారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపుతారు. వారి ఆమోదం లభించిన అనంతరం రానున్న ఆర్థిక సంవత్సరంలో పనులు చేపడుతారు.
పనుల కల్పన ఇలా..
2023-24 ఆర్థిక సంవత్సరంలో మండలంలో ఉపాధిహామీ పనులు చేపట్టేందుకు అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. ఈ ఏడాది మండలంలోని 13 గ్రామ పంచాయతీల పరిధిలో 21 గ్రామాలున్నాయి. 2023-24 సంవత్సరానికి గాను మండలంలో 3,679 జాబ్ కార్డులుండగా.. 3,67,900 పని దినాలను కల్పించనున్నారు. రూ.9.45 కోట్లను కూలీలు చేసిన పనులకు చెల్లించనున్నారు. సామగ్రి కోసం రూ.5.81 కోట్లను కేటాయించారు. మొత్తం మండలంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పనుల కోసం రూ.15.28 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపి తీర్మానించారు.
ప్రతి కూలీకి పని కల్పించడమే లక్ష్యం
ఉపాధి హామీ పథకం ద్వారా పల్లెల్లో అభివృద్ధి పనులతో పాటు అన్ని రంగాల్లో పురోగతి కనిపిస్తుంది. నిరుపేద కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది. కూలీల ఉపాధికి ఆర్థిక భరోసా ఇస్తుంది. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రయోజనాలను గ్రామసభల్లో రైతులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. గ్రామసభల ద్వారా పనులను గుర్తిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న జాబ్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉంది. సందేహాలుంటే అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, టీఏలను సంప్రదించవచ్చు. – వెంకటేశ్వర్లు, ఎంపీడీవో
పనులను సద్వినియోగం చేసుకోవాలి
అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త జాబ్ కార్డులు అందజేస్తున్నాం. అడిగిన ప్రతి కూలీకి 100 రోజుల పని కల్పిస్తాం. వచ్చే సంవత్సరం ఉపాధి పనులు ప్రారంభం కానున్నాయి. ఉపాధి హమీ పనులు చేసేటప్పుడు కూలీలు పలు జాగ్రత్తలు పాటించాలి. ప్రతి ఒక్కరికీ పని కల్పించేలా చర్యలు చేపడుతున్నాం. ఉపాధి హమీ పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలి. 13 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించాం. అవసరమైన పనులు గుర్తించి తీర్మానించాం.
– రవి ప్రసాద్, ఏపీవో