కుభీర్ : సమాజంలో నానాటికి పెరిగిపోతున్న నేరాల నియంత్రణలో భాగంగా ప్రజలు అప్రమత్తం చేసేందుకు గ్రామాలల్లో కార్డెన్ సెర్చ్ (Cordon Search ) నిర్వహిస్తున్నట్లు భైంసా రూరల్ సీఐ నైలు నాయక్( CI Nailu Nayak) పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం నిగ్వా గ్రామంలో గురువారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు కుభీర్ ఎస్సై కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బృందాలు గ్రామంలో తనిఖీలను నిర్వహించారు. ఈ తనిఖీలో 120 బైకులు, 4 ఆటోలను సీజ్ చేసి సరైన పత్రాలు లేని, నంబర్ ప్లేట్లు లేని వాహనాలకు జరిమానా విధించారు.
ఈ సందర్భంగా సిఐ గ్రామ ప్రజలకు సీసీ కెమెరాల ఆవశ్యకత, సైబర్ క్రైం, గ్రామాల్లోకి వచ్చే అనుమానిత వ్యక్తుల విషయంలో అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్ బాధితులు 1930 టోల్ ఫ్రీ నెంబర్ను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలు ఐక్యమత్యంగా ఉంటూ శాంతియుతంగా మెలగాలని, అప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుంచెట్టి లక్ష్మీరాజు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు దొంతుల దేవిదాస్, దత్తు పటేల్, పోలీసులు, గ్రామస్థులున్నారు.