రెబ్బెన, ఫిబ్రవరి 12: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ శివారులో గల గుట్టపై కొలువై రెండో తిరుపతిగా విరాజిల్లుతూ విశేష పూజలు అందుకుంటున్న బాలాజీ వేంకటేశ్వరస్వామి జాతరకు భక్తులు బుధవారం పోటెత్తారు. ఏటా మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా జాతర నిర్వహిస్తారు. ఇందులో భాగంగా రథోత్సవం, కల్యాణం, ప్రత్యేక పూజలు కనుల పండువగా జరిగాయి. ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఆలయ అధికారులు వసతులు కల్పించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆసిఫాబాద్ జిల్లా ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి, మంచిర్యాల జిల్లా రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి నిరోష, జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ వేణుగోపాల్గుప్తా, ఈవోలు బాపురెడ్డి, రమేశ్, రవి, ఆలయ కమిటీ చైర్మన్ జయరాం, ఆర్టీఏ మెంబర్ లావుడ్య రమేశ్, గౌడ సంఘం అధ్యక్షుడు మోడెం సుదర్శన్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ పల్లె ప్రకాశ్‌రావు, మాజీ ఎంపీపీ బాలేశ్‌గౌడ్, మాజీ సర్పంచ్‌లు గంటుమేర, కొవ్వూరి శ్రీనివాస్, రవీందర్, నాయకులు పాల్గొన్నారు.